
తాజా వార్తలు
తెలంగాణలో రామరాజ్యమే లక్ష్యం : బండి
బాన్సువాడ: తెలంగాణలో రామరాజ్యం తేవడమే లక్ష్యంగా భాజపా కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నేత మాల్యాద్రి రెడ్డి భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తే.. వాటి పేర్లు మార్చి తమ నిధులని చెప్పుకుంటూ తెరాస పబ్బం గడుపుతోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్న తెరాసను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు నిలదీయాలని కోరారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గాన్ని పోచారం కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక, భూ వ్యాపారం చేస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు.