పోలింగ్‌ కేంద్రం నుంచి గవర్నర్‌కు దీదీ ఫోన్‌
close

తాజా వార్తలు

Updated : 01/04/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలింగ్‌ కేంద్రం నుంచి గవర్నర్‌కు దీదీ ఫోన్‌

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ఉద్రిక్తత నడుమ కొనసాగుతోంది. పలు చోట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ అభ్యర్థి మమతా బెనర్జీ.. అక్కడి నుంచే గవర్నర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. దీంతో నందిగ్రామ్‌ పోలింగ్‌ ఉద్రిక్తంగా మారింది. 

పలు కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని, భాజపా కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకుంటున్నారని తృణమూల్‌ నేతలు ఆరోపించారు. దీంతో నందిగ్రామ్‌లోనే ఉన్న మమత.. అక్కడి బోయల్‌ ప్రాంతంలో గల 7వ నంబరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అక్కడ ఒకింత ఘర్షణ వాతావరణం నెలకొంది. మమత రాకపై తృణమూల్‌, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

మరోవైపు పోలింగ్‌ కేంద్రం నుంచే దీదీ.. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌కు ఫోన్‌ చేశారు. ‘‘ఇతర రాష్ట్రాల నుంచి గూండాలు బెంగాల్‌కు వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు. వారికి కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి.  స్థానికులు ఓట్లు వేయకుండా ఆ గూండాలు అడ్డుకుంటున్నారు. నందిగ్రామ్‌లో ఏ క్షణాన ఏదైనా జరగొచ్చు. మేం ఉదయం నుంచి ఎన్నికల కమిషన్‌కు 63 ఫిర్యాదులు చేశా. కానీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరైనా దీనిపై చర్యలు తీసుకోండి’’ అని గవర్నర్‌ను కోరారు. అంతకుముందు ఆమె బోయల్‌కు చేరుకోగానే.. భాజపా కార్యకర్తలు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. 

రెండో విడత పోలింగ్‌లో భాగంగా బెంగాల్‌లో కీలక నందిగ్రామ్‌తో పాటు 30 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. సువేందు అధికారి కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని