close

తాజా వార్తలు

Updated : 02/05/2021 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా ఆశలకు ‘గాయం’

 కట్టుగట్టి పంతంబట్టి దీదీ గెలుపు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఫైర్‌బ్రాండ్‌ అనే పేరు తనకు ఎందుకు సరిపోతుందో మమతా దీదీ భాజపాకు అర్థమయ్యేట్లు చెప్పింది. తాను గానీ పంతంబడితే ఎంతదాకా అయినా పోరాడి విజయం సాధిస్తానని మరోసారి రుజువు చేసింది. ఆమె గాయపడిన ప్రతిసారి రెండింతల బలంతో రాజకీయాల్లో ఎదుగుతారనే పేరును నిలబెట్టుకొంది. 

దెబ్బతిని బెంగాల్‌ టైగరై..

కాంగ్రెస్‌ పార్టీలో యువనాయకురాలిగా కెరీర్‌ మొదలు పెట్టిన మమత 1975 జయప్రకాశ్‌ నారాయణ్‌కు వ్యతిరేకంగా చేసిన ఆందోళనతో  మీడియా దృష్టిలోపడ్డారు.  ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. 1984లో కమ్యూనిస్టు దిగ్గజం సోమ్‌నాథ్‌ ఛటర్జీని జాదవ్‌పూర్‌లో ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ రోజుల్లో  అత్యంత యువ పార్లమెంటేరియన్లలో ఆమె కూడా ఒకరు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. 

* 1990లో కమ్యూనిస్టు పార్టీ యూత్‌ విభాగానికి చెందిన లాలూ ఆలమ్‌ అనే నాయకుడు ఆమె ఇంటి సమీపంలోనే దాడిచేశాడు.  తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మమత దాదాపు నెలరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీలో ఆమె చరిష్మా ఒక్కసారిగా పెరిగిపోయింది.

* 1993లో ఓ వికలాంగ యువతిని సీపీఎం నాయకుడు అత్యాచారం చేసి గర్భిణిని చేశాడు. దీంతో ఆమెకు న్యాయం చేసేందుకు మమతనే స్వయంగా నాటి సీఎం జ్యోతిబసు ఆఫీస్‌ ఎదుట బాధితురాలితో కలిసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో భారీ బలగాలతో వచ్చిన పోలీసులు ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి లాల్‌బజార్‌ సెంట్రల్‌ పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో వేశారు. 

* 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ నుంచి వేరుపడి సొంతంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసిన దీదీ ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో నందిగ్రామ్‌ ఉద్యమ సమయంలో 2006,2007లో పలు మార్లు ఆమెపై దాడులు జరిగాయి.

* 2010లో ఆమె రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కాన్వాయ్‌ను  ఓ ట్రక్కు ఢీకొంది. ఇది కూడా ఆమెపై జరిగిన హత్యాయత్నమనే అనుమానాలు ఉన్నాయి.

* 2021 ఎన్నికల ప్రచార సమయంలో మరోసారి తనపై దాడి జరిగిందని మమత ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె కాలి ఎముకకు గాయం కావడంతో కట్టుకట్టుకొనే ప్రచారంలోకి దిగారు.  ప్రతిపక్షాలు ఆమెది ఓ ఎమోషనల్‌ డ్రామాగా ఎద్దేవా చేసినా పట్టించుకోలేదు.. ఒంటికాలితో బెంగాల్‌ను గెలుస్తానని సవాల్‌ విసిరి.. చేసి చూపించారు. 

2019ని ఫలితాలను 2009తో పోల్చి బోల్తా.. 

భాజపా 2019 ఫలితాలను అతిగా ఊహించుకొని బోల్తాపడింది. వాస్తవానికి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటారనే అంశాన్ని కమలనాథులు విస్మరించారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలనుకొని భాజపాకు ఓటువేశారు. ఆ అంశాన్ని పశ్చిమబెంగాల్‌లో మార్పు కోరుకొంటున్నట్లు భాజపా ఊహించుకొంది.  ఎందుకంటే 2009 పార్లమెంట్‌ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీ- కాంగ్రెస్‌ బృందం భారీగా సీట్లు సాధించింది. అదే ఊపును 2011 శాసన సభ ఎన్నికల్లో మమత అందిపుచ్చుకొని 184సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి తమకు కూడా అలానే అవుతుందని భాజపా ఆశించింది. కానీ, బెంగాల్‌ ప్రజలు వేరేలా తలచారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కంటే తక్కువశాతం ఓట్లు భాజపాకు దక్కాయి. కాకాపోతే.. ప్రధాన ప్రతిపక్షాల నుంచి హిందూ ఓట్లు, టీఎంసీ నుంచి కొన్ని ఓట్లు దక్కించుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక్కటే కమలనాథులకు ఊరటనిచ్చింది.

ఉప్పెనకు ఎదురీది..

దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా పేరున్న భాజపా ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడ గెలిస్తే  ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టాలని భావించింది. అందుకే మెయిన్‌ స్ట్రీమ్‌, సోషల్‌ మీడియాలో ప్రచారాల మోతెక్కించింది. టీఎంసీలోని దిగ్గజ నాయకులను తమ పక్షాన చేర్చుకొంది. ఈ ఎన్నికల క్రమంలో కొవిడ్‌ రెండో తరంగాన్ని విస్మరించడం భాజపాకు ఎసరు తెచ్చింది.

ఇక ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించడంతో.. ఒక్కో విడతపై సర్వశక్తులు ఒడ్డి  పోరాడాలనుకున్న భాజపా వ్యూహం దెబ్బతింది. అప్పటికే మోదీ 20, అమిత్‌షా 50, భాజపా చీఫ్‌ జేపీ నడ్డా 40 సమావేశాలు నిర్వహంచినా ప్రయోజనం లేకపోయింది.  అనుకోని ముప్పుగా కరోనా తిరిగిరావడంతో ఆ పార్టీ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరైంది. ఎప్పుడు పోలింగ్‌ పూర్తవుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది.

మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు పూర్తయ్యే నాటికి భాజపా ఓట్లశాతం పడిపోతూ వస్తున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తొలి రెండు విడతల్లో కమలం పార్టీకి 45 నుంచి 46శాతం ఓట్లు లభించగా..  ఐదు, ఆరు విడతల్లో 46, 45శాతం ఓట్లు పడ్డాయి. ఏడు, ఎనిమిదో విడతల నాటికి కొవిడ్‌ దేశంలో, పశ్చిమబెంగాల్‌లో విలయతాండవం చేస్తుండటంతో భాజపా ఓట్ల శాతం 40, 37శాతం పడిపోయినట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్‌ టుడే విశ్లేషణ పేర్కొంటోంది.  భాజపా ఎదుర్కొన్న ఏ ఇతర ఎన్నికలకన్నా ఈ ఫలితం చాలా భిన్నమైంది. దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కొవిడ్‌ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఫలితమే ఈ ఎన్నికల్లో ప్రస్పుటించింది.

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని