
తాజా వార్తలు
‘ఇంటికి పిలిచి ఎవరైనా అవమానిస్తారా?’
భాజపా కల్చర్ అదేనంటూ మమత ఆగ్రహం
పర్సురా: మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్లో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల నేతాజీ జయంతి వేడుకల్లో తనను అవమానపరిచ్చారంటూ ప్రధాని సమక్షంలోనే నిరసన వ్యక్తంచేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సోమవారం భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాల్లో జై శ్రీరాం నినాదాలు చేయడం ద్వారా ఆయన గౌరవానికి భంగం కలిగేరీతిలో వ్యవహరించడం తగదన్నారు. బెంగాల్‌కు చిహ్నాలైన వ్యక్తులను తరచూ భాజపా అవమానపరుస్తోందన్నారు. సోమవారం పర్సురాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన మమత.. ‘‘ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానిస్తే.. ఆ వ్యక్తిని అవమానిస్తారా? ఇది బెంగాల్ సంస్కృతా? మన దేశ సంస్కృతా? నేతాజీని కొనియాడుతూ వారు నినాదాలు చేస్తే నేను హర్షం వ్యక్తంచేసేదాన్ని. కానీ వాళ్లు అలా చేయలేదు. ఆ కార్యక్రమానికి సంబంధంలేని నినాదాలు చేసి నన్ను కించపరిచారు. ఈ దేశ ప్రధాని ముందే నేను అవమానానికి గురయ్యాను. ఇదీ భాజపా సంస్కృతి’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
త్వరగా వెళ్లిపోండి..
తమ పార్టీని వీడి భాజపాలోకి వెళ్తున్న నేతలను ఉద్దేశించి మమత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు రావని తెలిసే వాళ్లు పార్టీ నుంచి నిష్క్రమించారన్నారు. వాళ్లు వీడి వెళ్లిపోవడమే మంచిదని.. లేదంటే తామే బయటకు పంపేసేవాళ్లమని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే త్వరగా ఆ పని చేయండి అంటూ మమతా సూచించారు. శనివారం రోజున నేతాజీ జయంతి వేడుకల సందర్భంగా విక్టోరియా మెమోరియల్ వద్ద ప్రధానితో కలిసి పాల్గొన్న సభలో మమత మాట్లాడుతుండగా జనంలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మమత తనను అవమానపర్చారంటూ ప్రసంగించకుండానే వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
2లక్షల ట్రాక్టర్లతో రైతు కవాతు