close

తాజా వార్తలు

Published : 14/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగాల్‌ పోరు: భాజపా నేతలకు ఈసీ చురకలు!

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆగ్రహం

కోల్‌కతా: 24 గంటలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. తాజాగా అక్కడి భాజపా నేతలపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా కేంద్ర బలగాల చేతిలో మరణించిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత రాహుల్‌ సిన్హా ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. అటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని భాజపా బెంగాల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, భాజపా నేత సువేందు అధికారికి ఎన్నికల సంఘం చురకలంటించింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

భాజపా నేతపై 48 గంటల నిషేధం..

కేంద్ర బలగాలు నలుగురిని కాకుండా ఎనిమిది మందిని చంపాల్సిందంటూ బెంగాల్‌ భాజపా నేత రాహుల్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండించింది. వాటిని తీవ్రంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా పరిగణించిన ఈసీ, అవి శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో రాహుల్‌ సిన్హా ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, ఆయనకు నోటీసు ఇవ్వకపోయినా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

సువేందు అధికారి.. జాగ్రత్తా!

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ స్థానం కీలకమనే విషయం తెలిసిందే. అక్కడి నుంచి మమతా బెనర్జీపై పోటీ చేసిన సువేందు అధికారిపై తాజాగా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బేగంకు ఓటు వేస్తే ఇదో మినీ పాకిస్థాన్‌ అవుతుంది’ అని సువేందు చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో సున్నితమైన విషయాలపై వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. సువేందు చేసిన వ్యాఖ్యలపై తృణమూల్‌ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, పరిశీలించిన అనంతరం ఆయనను ఎన్నికల సంఘం మందలించింది.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడి నోటీసులు

కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రస్తావించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఇలాంటివి చాలా చోట్ల పునరావృతమవుతాయని వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటనపై ఫిర్యాదు అందుకున్న ఈసీ ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని హెచ్చరించింది. అది ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేదిగా ఉందని, ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, దీనిపై బుధవారం లోగా వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు జారీ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు ఎన్నికల కోడ్‌ నిబంధనలను ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు హింసాత్మక ఘటనలకు కారణమవుతాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు భాజపా నేతలపైనా చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా, మిగిలిన 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని