
తాజా వార్తలు
నీళ్లనుకుని శానిటైజర్ తాగిన అధికారి
ముంబయి: కరోనా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ శానిటైజర్ బాటిళ్లు ఉంటున్నాయి. దుకాణాలు, ఆఫీసుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక పెద్ద పెద్ద సమావేశాల్లోనూ టేబుళ్లపై నీళ్ల సీసాలతో పాటు శానిటైజర్లను కూడా ఉంచుతున్నారు. అయితే ఇలా పెట్టడం వల్లే ఓ అధికారి పొరబాటుగా శానిటైజర్ తాగారు. మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సమావేశంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్ కార్పొరేషన్ నేడు బడ్జెట్‌ను ప్రకటించింది. ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రమేశ్ పవార్ కూడా పాల్గొన్నారు. విద్యాశాఖ జాయింట్ కమిషనర్ అనారోగ్యంతో సమావేశానికి రాకపోవడంతో రమేశ్ విద్యా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే తన ప్రసంగానికి ముందు నీరు తాగబోయిన ఆయన.. పొరబాటుగా శానిటైజర్ తాగారు.
ఒకే రకంగా ఉన్న నీళ్ల సీసా, శానిటైజర్ బాటిల్ పక్కనపక్కనే ఉండటంతో ఈ పొరబాటు జరిగింది. అయితే వెంటనే తేరుకున్న రమేశ్.. శానిటైజర్‌ను ఉమ్మేశారు. ఆ తర్వాత సిబ్బంది ఆయనకు మంచినీరు అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఘటన తర్వాత టేబుల్‌పై నుంచి శానిటైజర్ సీసాలను తీసేసినట్లు బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 12 మంది చిన్నారులకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసిన విషయం తెలిసిందే. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఇదీ చదవండి..
పోలియో చుక్కలకు బదులు శానిటైజర్!