close

తాజా వార్తలు

Published : 06/08/2020 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైరస్‌కన్నా భయమే కుంగదీస్తోంది

స్థానికుల వివక్షతో ఆత్మహత్యలకు పాల్పడుతన్న బాధితులు


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సోకిన వారిని నేరుగా వెళ్లి కలిసే వీలుండదు. ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉండటమే ఇందుకు కారణం. అలా అని బాధితులను ఒంటరిగా వదిలేస్తే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాస్త ధైర్యం నింపేలా బాధితులతో మాట్లాడే వారే కరవయ్యారు. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తోంది. ఏంకాదని, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పేవారు లేక బాధితులు కుంగిపోతున్నారు. ఇదే వారిలో మానసిక రుగ్మతలు, నైరాశ్యానికి దారి తీస్తోంది. తమకు తాముగా ఒంటరిగా అయిపోయామన్న భావనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నవారితో పాటు వివక్ష ఎదుర్కొని బలవన్మరణం చెందుతున్నవారూ ఉన్నారు.

ప్రతిరోజూ ఓ ఐదు నిమిషాల పాటు కరోనా బాధితుడితో మాట్లాడి భరోసా ఇస్తే ఎలాంటి సమస్య ఉండదంటున్నారు మానసిక నిపుణులు. కరోనా సోకిన వారిని వివక్షతో చూడవద్దని అవగాహన కల్పిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో కరోనా భయం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది అనేక కుటుంబాల్లో అలజడి రేపుతోంది. మానసిక నిపుణులను సంప్రదించే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రక్తపోటు ఉన్నవారిలో ఈ తరహా ఒడుదొడుకులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కరోనా సోకిన వారే కాకుండా ఇరుగు పొరుగు అదేస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. అసలే మానసికంగా బాధపడుతున్న బాధితులకు చుట్టుపక్కల వారు చూపిస్తున్న వివక్ష మరింత కుంగుబాటుకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కరోనా నుంచి కోలుకున్నా ఇంటికి వచ్చేందుకు కొందరు స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. తమకు వైరస్‌ సోకుతుందని వేరే చోటికి తరలిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారు తీవ్రంగా వివక్ష ఎదుర్కొంటున్నారు. అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని చెబుతున్నారు. బాధితులు కొందరు ఈ ఇబ్బందులు తట్టుకుంటున్నా, మరికొందరు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇలా బతకడం కన్నా చావడమే మేలని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 

ఇలాంటి ఘటనలు ఇటీవల పలుచోట్ల వెలుగు చూశాయి. కొవిడ్‌ బారిన పడి కోలుకున్న భార్యభర్తలు ఇంటికి వచ్చిన తరువాత బంధువులు, ఇరుగు పొరుగువారు చూపించిన వివక్ష భరించలేక మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని బహిష్కరించడం వల్ల తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో 3 నెలల క్రితం చోటు చేసుకుంది. కరోనా నెగెటివ్‌ అని తేలినా గ్రామస్థులు ఆ వ్యక్తిని దూరం పెట్టారని ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లా రామసముద్రం మండం బైరాజుపల్లెలో కరోనా నుంచి కోలుకున్న వృద్ధురాలు తనతో ఎవరూ మాట్లాడటం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.  కరోనా నుంచి కోలుకున్న ఆమెతో బంధువులు ఎవరూ మాట్లాడలేదు. ఇంటికి ఎవరూ రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఇలా వివక్షకు గురవుతామనే భయంతో కొందరు కరోనా లక్షణాలున్నా బయటకు చెప్పకుండా దాచేస్తున్నారు. ఇంటి వైద్యంతో బయట పడవచ్చనే ఆలోచన, ఏం కాదనే నిర్లక్ష్యం వెరసి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్యం విషమించి పరిస్థితి చేదాటిపోయి ప్రాణాలు కోల్పోతున్నవారూ ఉన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. వివక్ష భయంతో చాలా మంది సకాలంలో ఆసుపత్రికి వెళ్లడం లేదు. మొదట్లోనే చికిత్స తీసుకుంటే సులువుగా బయట పడే వీలుంటుంది. కానీ వివక్ష భయంతో చివరి దశలో చేరడంతో ప్రాణాల మీదకు వస్తోంది. 99 శాతం మంది కరోనా బాధితులు తిరిగి కోలుకుంటున్నా కొందరు భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఇరుగుపొరుగు వారు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నబాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి భరోసానిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.