
తాజా వార్తలు
ఓటు మన హక్కు.. కదలండి.. ఓటేయండి
సినీ ప్రముఖుల పిలుపు
• మన నగరం.. మన రాజధాని.. మన హైదరాబాద్.. మన భవిష్యత్తు.. మన పాలన.. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఓటు వేసి మన శక్తిని చూపిద్దాం.
- అక్కినేని నాగార్జున
• అప్నా హైదరాబాద్ అంటూ ఈ నగరాన్ని మనం నిజంగానే ప్రేమిస్తే తప్పకుండా ఓటేయాలి. నగరానికి మంచి పాలన అవసరం. మన హక్కును వినియోగించుకుందాం..
- దర్శకులు శేఖర్ కమ్ముల
• గ్రేటర్ హైదరాబాద్‌లో ఇపుడు ఓటరే బాహుబలి డబ్బులు, మద్యానికి ఆశపడి చేసుకోకు నీ బతుకు బలి..!అభ్యర్థులు ఎలాంటివారో, గత చరిత్ర ఏమిటో..ప్రజా సేవపై వారికున్న ప్రేమ ఎంతో నిర్ణయించి ఓటు వేయాలి నేడు.. నచ్చకుంటే బ్యాలెట్లో ‘నోటా’ ఉంది చూడు..!
- సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
• గాలి, నీరు, నింగి, నిప్పు, నేల.. ఇవి ప్రకృతి మనకు ప్రసాదించిన 5 వనరులు. రాజ్యాంగం మనకు కల్పించిన ఆరో వనరు ఓటుహక్కు. దానిని వినియోగించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాం. రండి.. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరం ఓటేద్దాం..
- వ్యాఖ్యాత, నటి ఝాన్సీ
• ఓటు మన హక్కు.. మన బాధ్యత.. మన ఉనికి.. మన అస్తిత్వం.. ఓటే మన ఆత్మగౌరవం.. ఇది రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధం.. సక్రమంగా వాడదాం.. సద్వినియోగం చేసుకుందాం.. లెట్స్ ఓట్..!!
- వ్యాఖ్యాత సుమ కనకాల
• నేడు జరిగే ఎన్నికల్లో మనందరం తప్పనిసరిగా హక్కు వినియోగించుకుందాం. మహానగరం అభివృద్ధి కోసం ఓటేద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఒక్క ఓటే కదాని ఎవరూ అశ్రద్ధ చేయొద్దు.. అదే రేపు ఫలితాన్ని మార్చుతుంది.
- ఎన్.శంకర్, దర్శకుడు
• భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది.
- అలీ, సినీ నటుడు
• ప్రజలు పాలనలో భాగస్వాములవ్వాలి. వార్డు కమిటీల్లో స్థానం కల్పించాలి. దిల్లీ తరహాలో స్వయం పరిపాలన అవసరం. ప్రజల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు అన్న భావన కలిగించాలి. అప్పుడే ఓటేసేందుకు ఉత్సాహం చూపిస్తారు.
- జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు
• పౌరుడిగా పాలకులను నిర్ణయించుకునే హక్కు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. ఓటేయడం మన బాధ్యత. నగర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ హక్కును వినియోగించుకోవాలి.
- మహేశ్‌బాబు
• ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటేయాలి. పోలింగ్ కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులతో వెళ్దాం. హైదరాబాద్ అభివృద్ధి, శాంతి సౌభాగ్యాల కోసం మన హక్కును ఉపయోగిద్దాం.
- విజయ్ దేవరకొండ
• ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునేందుకు ఓటు మనకు సువర్ణావకాశం.ఏ ఎన్నిక అయినా అందులో పాల్గొనడం, ఓటేయడంతో పాటు సమర్థులైన నాయకులను ఎన్నుకోవడం అవసరం. అప్పుడే అభివృద్ధి సాధ్యం.
- ప్రియమణి
• ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా.ఉద్వేగాలకు, డబ్బులకు దానిని ఫణం పెట్టొద్దు. ఓటు తప్పకుండా వేయడం ఎంత అవసరమో, ఆలోచించి వేయడం కూడా అంతే అవసరమని గుర్తించాలి.
- సుధీర్‌బాబు
• మనిషిని బతికించాలంటే రక్తం ఎంత అవసరమో మానవ మనుగడకు ఓటూ అంతే. మన శ్రేయస్సును కోరే నాయకులకు అది ‘విజయ తిలకమవ్వాలి. నచ్చని లీడర్ల పాలిట వేటవ్వాలి. ఓటును అమ్మకండి.
- ఉత్తేజ్