
తాజా వార్తలు
ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్!
దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు మంగళవారం జరిపిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఉద్రిక్తతలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన నార్త్ బ్లాక్‌లో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం. సమావేశానికి న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఐబీ అధికారులు, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు హాజరైనట్లు తెలుస్తోంది. కారకులపై చర్యలు తీసుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఎర్రకోట ఘటన కారకులపై కఠిన చర్యలు..!
ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనను హోంశాఖ మరీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందుకుగానూ ఉన్న అవకాశాలపై న్యాయశాఖ సలహాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కారకులను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసు కమిషనర్ని హోం శాఖ కార్యదర్శి ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిన్నటి ఘటనల నేపథ్యంలో హింస జరిగిన ప్రాంతాల్లో బుధవారం అదనపు భద్రతా బలగాల్ని మోహరించినట్లు ఇప్పటికే దిల్లీ పోలీసులు హోం శాఖకు నివేదిక అందజేశారు. నిన్న జరిగిన హింసకు సంబంధించి అధికారికంగా 22 కేసులు నమోదు అయినట్లు నివేదించారు. పలువురు రైతు సంఘ నాయకుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సమాచారం.
దిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ ఘటనలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో ఐబీ, కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హింస జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందని.. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అవసరమైతే మరిన్ని బలగాల్ని మోహరించాలని హోం శాఖ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 15 కంపెనీల పారామిలటరీ దళాలను కేటాయిస్తూ నిన్న సాయంత్రం హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే, నిన్నటి హింసాత్మక ఘటనల్లో గాయపడిన పోలీసులకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సుప్రీంలో వ్యాజ్యాలు...
మరోవైపు కిసాన్ గణతంత్ర పరేడ్ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నిన్నటి ఉదంతాల్ని సుమోటోగా స్వీకరించాలని కోరుతూ న్యాయవాది వినీత్ జిందాల్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. నిబంధనల్ని అతిక్రమిస్తూ ఎర్రకోటపై వేరే జెండా ఎగురవేశారని.. దిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన లేఖను పిటిషన్‌గా స్వీకరించి విచారించాలని కోరారు. మరోవైపు ఇదే విషయంపై న్యాయవాది విశాల్ తివారీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. హింసాత్మక ఘటనలపై న్యాయ విచారణ జరపాలని కోరారు. ముగ్గురు సభ్యులతో దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఎర్రకోట ఘటన బాధ్యులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసుల నిరసన...
గణతంత్ర పరేడ్‌లో రైతులు తమపై దాడి చేసినందుకు నిరసనగా దిల్లీ పోలీసులు నేడు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పోలీసులతో పాటు వారి కుటుంబాలు కూడా ఈ నిరసనలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఐటీవో షాహిదీ పార్క్ ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం విధుల్లో ఉన్నవారంతా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి...
కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి దిల్లీ