close

తాజా వార్తలు

Updated : 09/04/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విధ్వంసం చేసేవాళ్లు తెరమరుగవుతారు: చంద్రబాబు

హైదరాబాద్‌: విధ్వంసం చేసేవాళ్లు చరిత్రగతిలో తెరమరుగవుతారన్న సంగతి ఇప్పటికైనా ఏపీ సీఎం జగన్‌ గ్రహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హితవు పలికారు. వ్యవస్థల నిర్మాణం చాలా కష్టమన్న ఆయన.. వ్యక్తి చెయ్యలేని పనిని వ్యవస్థ ద్వారా చెయ్యవచ్చని సూచించారు. వీటిని గుర్తించి ఇకనైనా రాష్ట్రంలో విధ్వంసాలకు స్వస్తి చెప్పి వ్యవస్థల నిర్మాణం, వాటి బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతూ జగన్‌కు ఐదు ప్రధానాంశాలతో లేఖ రాశారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ ప్రాధాన్యత గుర్తించిన తరహాలోనే ‘అన్న క్యాంటీన్లు’ ‘చంద్రన్న బీమా’ పథకాలను పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు.  

 
 రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్లను రాజకీయ కక్షతో మూసివేయడం తగదని విమర్శించారు. . అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే.. కరోనా సంక్షోభంలో పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేవన్నారు. కేరళలో పీపుల్ క్యాంటీన్లు, కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, హైదరాబాద్ లో అన్నపూర్ణ క్యాంటీన్ల విజయగాథల స్ఫూర్తితో అయినా మన రాష్ట్రంలో  అన్న క్యాంటీన్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని అర్ధంతరంగా రద్దు చేయడం అనాలోచిత చర్య అన్న  చంద్రబాబు... ఇప్పుడదే పథకం ఉండి ఉంటే కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు, భవిష్యత్ పై ఎంతో భరోసాగా నిలిచేదన్నారు. తక్షణమే బీమా పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గాడితప్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)కి నూతన జవసత్వాలు కల్పించి మళ్లీ సమర్ధంగా నిర్వహించాలని సూచించారు.  

 లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి జీవనం దుర్భరంగా మారిన రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, ఇతర చేతివృత్తులవారు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి తక్షణమే కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్‌చే శారు. ప్రస్తుత సంక్షోభంలో 55 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ చేసేలా టెస్టింగ్ కిట్ల తయారీకి విశాఖ మెడ్ టెక్ జోన్ వేదిక కావడం శుభపరిణామం అని చంద్రబాబు అన్నారు. రోజుకు 2వేల కిట్ల తయారీ సామర్థ్యం, ఈ నెలాఖరుకు 25వేల కిట్ల తయారీకి, మే నెలాఖరుకు ఏడున్నర లక్షల కిట్ల తయారీకి చేరుకోవడం ప్రస్తుత కరోనా కారుచీకట్లో నిజంగా కాంతిరేఖలేనని అభిప్రాయపడ్డారు. 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని