అన్నింటిలోనూ అవినీతే: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 03/07/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నింటిలోనూ అవినీతే: చంద్రబాబు

అమరావతి: కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మేలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా అనేది ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిందన్న చంద్రబాబు.. సమస్యను ఎలా ఎదుర్కొని ముందుకెళ్లాలో ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో చాలా సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

‘‘లాక్‌డౌన్‌ పెట్టిన తర్వాత ఏపీకి రూ.8వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆనిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.5వేలు చొప్పున ఇవ్వాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కరోనా కిట్లు,  బ్లీచింగ్‌ కొనుగోలులో అవీనితికి పాల్పడ్డారు. 108, 104 వాహనాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా రూ.307 కోట్లు కట్టెబెట్టారు’’ అని చంద్రబాబు ఆరోపించారు. అనుభవం ఉన్న సంస్థను పక్కనపెట్టి విజయసాయిరెడ్డి వియ్యంకుడికి 108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్ట్‌ కట్టబెట్టారని పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పబ్లిసిటీతో మనుగడ సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తమపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్ఛార్జి చేస్తారా?
టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని బలవంతంగా అసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అనారోగ్యంగా ఉందని చెప్పినా బలవంతంగా డిశ్ఛార్జి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తి పట్ల ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. అచ్చెన్నాయుడు ఎలాంటి తప్పు చేయకపోయినా అనేక విధాలుగా వేధిస్తున్నారన్నారు. అచ్చెన్నాయుడికి రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి రావడానికి ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. రాజధాని కోసం 29వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని రైతులు 200 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని