ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

అమరావతి: ఏపీలో త్వరలో జరగనున్న పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.  రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని ఆయన ఆరోపించారు. పరిషత్‌ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల బహిష్కరణపై తెదేపా పొలిట్‌బ్యూరో చర్చించిన అనంతరం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారు

కొత్త ఎస్‌ఈసీ నీలంసాహ్ని వచ్చీ రాగానే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆక్షేపించారు. పరిషత్‌ ఎన్నికల్లో ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే తాజా ఎన్నికల్లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 2014లో 1శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి 19శాతం అయ్యాయని గుర్తు చేశారు. అధికార వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని మండిపడ్డారు.

అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేం

పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. పరిషత్‌ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని.. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేమని.. ఎస్‌ఈసీ తీరుకు నిరసనగా తమ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. తెదేపా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఎన్నికల బహిష్కరణపట్ల బాధ, ఆవేదన ఉందని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో దివంగత సీఎం జయలలిత, మాజీ సీఎం జ్యోతి బసు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత కఠిన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడతామని చంద్రబాబు చెప్పారు.

వివేకా కుమార్తె ప్రశ్నలకు సమాధానముందా?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. సునీత ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా? అని నిలదీశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని