సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్‌పై చైనా వేటు!
close

తాజా వార్తలు

Updated : 04/03/2021 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్‌పై చైనా వేటు!

బీజింగ్‌: గల్వాన్‌ ఘటనలో చైనా సైనికుల మరణాల సంఖ్యపై సందేహం వ్యక్తంచేసిన ఓ బ్లాగర్‌పై చైనా కేసు నమోదు చేసింది. భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికులను అవమాన పరిచారనే అభియోగాలపై అతడిపై కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆ ఘటనలో కేవలం సాధారణ సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఉన్నతాధికారి ప్రాణాలతో బయటపడడాన్ని ఈ యువకుడు ప్రశ్నించినందుకే చైనా అధికారులు అతడిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది.

చైనాకు చెందిన కియూ జిమింగ్‌ (38) అనే యువకుడికి అక్కడి సామాజిక మాధ్యమం ‘వైబో’లో దాదాపు 25లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గల్వాన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేస్తూ అతడు రెండు పోస్టులు పెట్టాడు. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణలో కమాండర్‌ స్థాయి అధికారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.. ఉన్నతాధికారి కావడం వల్లనే అతడు బతకగలిగాడు అని తొలి పోస్టులో పేర్కొన్నాడు. అధికారులు వెల్లడించిన దానికంటే ఎక్కువ మంది చైనా సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చంటూ మరో పోస్టులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గల్వాన్‌ ఘర్షణలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఓ ఉన్నతాధికారికి తీవ్ర గాయాలు అయ్యాయని చైనా అధికారికంగా వెల్లడించిన తర్వాత కియూ జిమింగ్‌ ఈ విధంగా స్పందించాడు. దీంతో యువకుడి పోస్టులపై చైనా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించి చైనా సైనికుల అపఖ్యాతికి కారణమయ్యారని ఆరోపిస్తూ అతడిపై తీవ్ర అభియోగాలు మోపినట్లు చైనా మీడియా వెల్లడించింది.

తూర్పు లాద్దాఖ్‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందినట్లు భారత్‌ అప్పుడే ప్రకటించింది. కానీ, చైనా మాత్రం వారి సైనికుల మరణాల సంఖ్యపై పెదవి విప్పలేదు. చివరకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఆ ఘర్షణలో కేవలం నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కొన్ని నెలల తర్వాత వెల్లడించింది. దీనిపై రష్యా మీడియా మాత్రం గల్వాన్‌ ఘటనలో దాదాపు 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ నివేదికలో పేర్కొంది. చైనా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కక్షగట్టి అణచివేస్తోందన్న వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని