ఛీ.. ఛీ.. చైనా..!
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 18:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛీ.. ఛీ.. చైనా..!

స్వదేశీయులే చీదరించుకొనేలా ప్రభుత్వ సంస్థ పోస్టు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

సాధారణంగా మన నిర్లక్ష్యం వల్ల పక్కవాడికి తీవ్ర నష్టం వాటిల్లితే బాధపడటం మానవత్వం అంటారు.. అలాంటి సందర్భంలో వీలైతే చేతనైనంత సాయం చేస్తాం.. లేకపోతే మౌనంగా ఉంటాము. అంతేగానీ వెక్కిరించము. కానీ, మన పొరుగు దేశం చైనా అలాకాదు.. కరోనా వైరస్‌తో ప్రపంచం ఎంత ఇబ్బంది పడిందో తెలిసి కూడా ఇసుమంత కూడా పశ్చాత్తాపం ప్రకటించలేదు. తప్పు అంగీకరించకపోగా.. ఇతర దేశాలపై నెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ దేశంలో వైరస్‌ అదుపులో ఉందని చెప్పుకొంటూ.. పొరుగుదేశాలను హేళన చేస్తోంది.

చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సెంట్రల్‌ పొలిటికల్‌ అండ్‌ లీగల్‌ అఫైర్స్‌ కమిషన్‌ భారత్‌ను వెక్కిరిస్తూ ఓ జుగుప్సాకరమైన పనిచేసింది. ఆ దేశంలోని న్యాయస్థానాలు, పోలీసులను నియంత్రించే ఈ లా అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇటీవల విబోలో ఒక పోస్టు చేసింది. దీనిపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ సంస్థ తన పోస్టును డిలీట్‌ చేయాల్సి వచ్చింది.

చైనా అంతరిక్షంలో ఒక స్పేస్‌ సెంటర్‌ను నిర్మించాలనుకుంటోంది. దీనికి సంబంధించిన తియాన్హే కోర్‌మాడ్యూల్‌ ఏప్రిల్‌ 29న విజయవంతంగా కక్ష్యంలోకి ప్రవేశపెట్టింది. అంతవరకు బాగానే ఉంది. ఈ విజయాన్ని చెప్పుకోవడానికి సెంట్రల్‌ పొలిటికల్‌ అండ్‌ లీగల్‌ అఫైర్స్‌ కమిషన్‌ తియాన్హే కోర్‌మాడ్యూల్‌ ప్రయోగం - భారత్‌లో చితిమంటల ఫొటోలను కలిపి పోస్టు చేసింది. ‘చైనా వెలిగించిన మంటలు వర్సెస్‌  భారత్‌ వెలిగించిన మంటలు’ అంటూ దిగజారిన వ్యాఖ్యలను జోడించింది. ఈ పోస్టుపై చైనాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా మంది ఆన్‌లైన్‌ యూజర్లు దీనిపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మర్నాడే ఆ పోస్టు మాయమైంది.

చైనా విదేశంగా శాఖ స్పందిస్తూ ‘‘భారత్‌  కొవిడ్‌పై చేస్తున్న పోరాటానికి చైనా ప్రభుత్వం, ప్రజల మద్దతుపై దృష్టి పెడతారని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో భారత్‌కు సరఫరాలను మరింత పెంచి మా మద్దతు ఏమిటో చూపిస్తాం ’’ అంటూ సమాధానం ఇచ్చింది. 

మండిపడ్డ గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌..

సాధారణంగా భారత్‌పై వ్యతిరేక కథనాలు రాసే గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ హూషిజిన్‌ కూడా ఈ విబో పోస్టుపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వాన్ని అత్యున్నత శిఖరంపై ఉంచాలి. కుదిరితే భారత్‌పై జాలిచూపండి. చైనాలోని నైతిక విలువను ఉన్నత  స్థానంలో ఉంచండి’’ అని విబో కామెంట్లలో పోస్టు చేశారు. సోషల్‌ మీడియా ఖాతాకు ట్రాఫిక్‌ పెంచుకోవడానికి ఇలాంటి పనులు చేయకూడదని హితవు పలికారు. 

షీ జిన్‌పింగ్‌ లేఖ రాసిన రోజుల్లోనే..

కొవిడ్‌పై పోరులో భారత్‌కు మద్దతు తెలుపుతూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ లేఖ రాసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ‘కరోనా మహమ్మారి విజృంభణతో భారత్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. నాతో పాటు చైనా ప్రభుత్వం, ప్రజల తరపున భారత ప్రభుత్వానికి, ప్రజలకు మనస్ఫూర్తిగా సానుభూతి తెలియజేస్తున్నాను. మహమ్మారిపై భారత్‌ చేస్తోన్న పోరాటంలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సహాయాన్ని అందించేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నట్లు గత వారం చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్‌కు అన్నివిధాలుగా అండగా నిలుస్తామని పేర్కొంటూ చైనా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి వాంగ్‌ యీ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. 

చైనా- డబ్ల్యూహెచ్‌వో సంయుక్త సమర్పణలో..

చైనా చెప్పిన తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మి దానినే ప్రపంచం నెత్తిపై రుద్దడం ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ  టెడ్రోస్‌కే చెల్లింది. డిసెంబరు 30వ తేదీనే చైనాలోని నేత్రవైద్యుడు డాక్టర్‌ వెన్‌లియాంగ్‌ సార్స్‌ వంటి  వైరస్‌ మనిషికి సోకిందని నివేదికలతో సహా సామాజిక మధ్యమాల్లో వెల్లడించారు. అయినా ‘సార్స్‌ కోవ్‌ 2 అంటువ్యాధి అనడానికి ఆధారాల్లేవు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లో ట్వీట్‌ చేసింది. 

చైనా నుంచి వైరస్‌ జన్యుసమాచారం రాబట్టడంలో ఆలస్యం చేయడం, అన్నింటికీ మించి- చైనా వాస్తవాన్ని దాచిందని తెలుస్తున్నా ‘వ్యాధిని అరికట్టడంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది’ అని టెడ్రోస్‌ పొగడ్తలతో ముంచెత్తడం ప్రపంచ దేశాలకు ఆగ్రహం తెప్పించింది. జనవరి 31న చైనా నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించడాన్ని టెడ్రోస్‌ తప్పుబట్టడం మరీ విచిత్రం. 100 దేశాల్లో కొవిడ్‌ వ్యాపించేదాకా చోద్యం చూసి, ఆ తరవాతే ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది.

చైనాను ఏ దశలోనూ డబ్ల్యూహెచ్‌ఓ ప్రశ్నించలేదు. దీంతో ఆ సంస్థ చైనా విషయంలో బాగా మెతక వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును పరిశీలిస్తే అది చైనాకు ప్రజా సంబంధాల విభాగం (పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏజెన్సీ)లా వ్యవహరిస్తోంది. ఇటీవల చైనాలో జరిగిన విచారణ కూడా మొక్కుబడిగానే ముగిసింది. డ్రాగన్‌ ఏమాత్రం సహకరించలేదని నిపుణుల బృందం ఆ తర్వాత పెదవి విరిచింది.  ఒక దశలో నిపుణుల బృందంతో చైనా అధికారులు ఘర్షణకు దిగినంత పనిచేసి భయపెట్టారు. ఇవేవీ సెంట్రల్‌ పొలిటికల్‌ అండ్‌ లీగల్‌ అఫైర్స్‌ కమిషన్‌కు తెలియనివి కాదు. ఇలాంటి నేపథ్యం పెట్టుకొని పొరుగుదేశాలను ఎగతాళి చేయడం చైనా ప్రభుత్వ సంస్థలకే చెల్లింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని