‘రక్షణ’పై డ్రాగన్‌ గట్టి పట్టు 
close

తాజా వార్తలు

Published : 05/03/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రక్షణ’పై డ్రాగన్‌ గట్టి పట్టు 

ఆ రంగానికి చైనా భారీ కేటాయింపులు

బీజింగ్‌: ఓవైపు భారత సరిహద్దుల్లో ప్రతిష్టంభన.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాతో రాజకీయ, సైనికపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది పొరుగుదేశం చైనా. ఇందుకోసం రక్షణ రంగ బడ్జెట్‌ను భారీగా పెంచేసింది. తొలిసారిగా ఈ రంగానికి 200 బిలియన్‌ డాలర్ల పైన కేటాయింపులు చేసింది. 

చైనా పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్‌ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించారు. ప్రస్తుత ఏడాదికిగానూ రక్షణ రంగానికి చైనా దాదాపు 1.35 ట్రిలియన్‌ యువాన్లు(దాదాపు 209 బిలియన్‌ డాలర్లు) కేటాయించినట్లు ఆ దేశ ప్రభుత్వ రంగ మీడియా జిన్హువా న్యూస్‌ వెల్లడించింది. వరుసగా ఆరో ఏడాది డిఫెన్స్‌ బడ్జెట్‌లో వృద్ధి కొనసాగినట్లు పేర్కొంది. గతేడాది ఈ బడ్జెట్‌ 1.268 ట్రిలియన్‌ యువాన్లు(దాదాపు 196.44 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. 

అయితే అమెరికా కేటాయింపులతో పోలిస్తే చైనా బడ్జెట్‌ పావు వంతు మాత్రమే. 2021 ఆర్థిక సంవత్సరానికి గానూ అగ్రరాజ్యం 740.5 బిలియన్ డాలర్లతో రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. భారత రక్షణ బడ్జెట్‌ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ రంగానికి భారత్‌ దాదాపు 65.7 బిలియన్‌ డాలర్లు కేటాయించింది.

గతేడాది గొప్ప విజయం..

ఈ సందర్భంగా 2020లో చైనా ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన ప్రధాని లీ.. సాయుధ బలగాలకు గతేడాది గొప్ప విజయం లభించిందని పేర్కొనడం గమనార్హం. చైనా, భారత్‌, లద్దాఖ్‌ పేర్లను  ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతేడాది దేశ రక్షణ వృద్ధిలో సాయుధ బలగాలకు గొప్ప విజయం చేకూరింది. మన సైన్యం పూర్తి సామర్థ్యంతో దేశ భద్రతను పరిరక్షించింది. మహమ్మారిని నియంత్రించడంలోనూ భాగస్వామి అయ్యింది. 20లక్షల మంది బలగంతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నాయకత్వం కూడా గొప్పగా పనిచేస్తోంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

అమెరికాను ఎదుర్కొనేందుకు..

ప్రపంచంలోనే రక్షణరంగానికి అధిక మొత్తంలో వెచ్చించే దేశాల్లో అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. అయితే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ విషయంలో అగ్రరాజ్యంతో ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుతూ వస్తోంది డ్రాగన్‌. 2027 నాటికి అమెరికాతో సమానంగా మిలిటరీని ఆధునీకీకరించేందుకు చైనా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు గతేడాది జరిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా కీలక సదస్సులో ఈ ప్రణాళికలకు ఆమోదముద్ర పడింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని