
తాజా వార్తలు
అక్కడ చైనా గ్రామం.. వివరణ కోరిన చిదంబరం
దిల్లీ: భారత భూభాగంలో చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని భాజపాకే చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రకటించారని.. మోదీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.
‘‘అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా గత సంవత్సరం 100 ఇళ్లున్న గ్రామాన్ని నిర్మించిందని.. ఆ రాష్ట్రానికే చెందిన భాజపా ఎంపీ తాపిర్ గావో తెలిపారు. భారత్‌కు చెందిన ఆ భూభాగంలో మార్కెట్, రెండు లైన్ల రోడ్డు సదుపాయం కూడా చైనా ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. ఇది నిజమైతే.. వివాదాస్పద ప్రాంతంలో చైనా ప్రజల కోసం శాశ్వత నివాసాలను నిర్మించటం ద్వారా ఆ దేశం యథాతథ స్థితి నిబంధనను అతిక్రమించినట్టే. మరి ఈ దిగ్భ్రాంతికర నిజాలపై ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుంది?’’ అని వరుస ట్వీట్లలో చిదంబరం ప్రశ్నించారు. భారత ప్రభుత్వం చైనాకు మరోసారి క్లీన్చిట్ ఇస్తుందా..? లేదా గత ప్రభుత్వాలను దోషులుగా చూపుతుందా? అంటూ ఈ మాజీ హోంమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాగా, ఇదే విషయమై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ స్పందించారు. దేశాన్ని తలదించుకునేలా చేయనంటూ మోదీ గతంలో చేసిన వాగ్దానాన్ని ఆయన గుర్తు చేశారు. చైనా గ్రామానికి సంబంధించిన పేపర్ వార్త క్లిప్పింగ్‌ను ట్వీట్ చేస్తూ.. ప్రధానిపై విమర్శలు చేశారు.
ఇదీ చదవండి..
దీదీని 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తా..