close
Array ( ) 1

తాజా వార్తలు

అపోహలొద్దు...ఆకాశమే హద్దు!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష- 2020

ఐఏఎస్‌కో, ఐపీఎస్‌కో ఎంపికవ్వాలనేది ఎందరో గ్రాడ్యుయేట్ల బంగారు కల! రాయాలనే ఆసక్తీ, అభిలాషా ఉన్నా కొందరు తమ స్థాయిపై అనుమానాలతో, పరీక్ష సన్నద్ధతపై అపోహలతో వెనుకంజ వేస్తుంటారు. వాటిని తొలగించుకుంటే దేశంలోనే అత్యుత్తమ సర్వీసులకు పోటీపడే నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు సన్నద్ధతకు ఆకాశమే హద్దు! లక్ష్యం బలంగా నిర్దేశించుకుంటే దాన్ని సాధించేలా పరిస్థితులూ సానుకూలమవుతాయి. తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ ప్రకటన సందర్భంగా.. విద్యార్థుల సందేహాలూ- అపోహలూ.. వాటి వాస్తవాలూ తెలుసుకుందాం!
సివిల్స్‌ పరీక్ష ఇతర పరీక్షల్లాంటిది కాదు. విభిన్న సబ్జెక్టుల్లో మౌలికాంశాలు తెలుసుకుని నిర్దిష్ట సబ్జెక్టుల్లో ప్రత్యేక అధ్యయనం చేయాల్సివుంటుంది.  ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడంచెల్లో ఉంటుందీ  పరీక్ష. యూపీఎస్‌సీ దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తుంది.
సుదీర్ఘకాలం ఆసక్తితో,  శ్రద్ధతో, సహనంతో సన్నద్ధత సాగించాల్సివుంటుంది. ఈ పరీక్ష ఎంత ప్రత్యేకమైనదైనా దీన్ని సాధించదల్చినవారు .అత్యంత తెలివితేటలున్న విద్యార్థులైవుండనవసరం లేదు. డిగ్రీ మామూలుగా పాసయినా చాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. దీక్షతో కృషి చేస్తే ఫలితమూ పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు మార్చి 3లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది.

పోటీ ఎక్కువే
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈసారి ప్రకటించిన పోస్టులు 796. గత ఏడాది కంటే ఈసారి 100 పోస్టులు తగ్గాయి. అభ్యర్థుల సంఖ్య కిందటి సంవత్సరం మాదిరే ఉండొచ్చు; లేదా కొంచెం పెరగవచ్చు; ఏ రకంగా చూసినా మే 31న జరగబోయే ప్రిలిమినరీ పరీక్షలో పోటీ పెరగనుంది!
ఆబ్జెక్టివ్‌ పరీక్ష అయిన ప్రిలిమినరీలో రెండు పేపర్లు. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1 (200 మార్కులు), జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2 (200 మార్కులు). ఈ రెండో పేపర్‌ అర్హత పరీక్ష. అంటే దీనిలో 67 మార్కులు (33 శాతం) తెచ్చుకుంటేనే పేపర్‌-1ను మూల్యాంకనం చేస్తారు. పేపర్‌-1లో ప్రతిభ చూపిన 10,500 మంది తర్వాతి అంచె అయిన మెయిన్స్‌ రాయటానికి అర్హులవుతారు.    

ప్రకటన నుంచి ఫలితం దాకా..
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షార్థులకు కింద చెప్పిన ప్రాథమిక లక్షణాలుండాలి. వీటిని ఎంత మెరుగుపర్చుకుంటే అంత ప్రయోజనకరం.
* సివిల్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తయారవ్వటం మంచిదేనా?
సివిల్స్‌ కొట్టాలనే లక్ష్యం ఉన్నవారు సివిల్స్‌ పరీక్షకు మాత్రమే సిద్ధమవుతూ... ఇదే సిలబస్‌ ఉన్న ఇతర పరీక్షలు కూడా రాస్తుండాలి. ఆ పరీక్షల్లో నెగ్గుతుంటే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆ రకంగా ఈ అనుభవాలు సివిల్స్‌లో విజయానికి సోపానాలుగా నిలుస్తాయి.
* సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఎందుకు రాయాలి?
సివిల్స్‌ ఎందుకు రాయాలనుకుంటున్నారో ప్రతి అభ్యర్థికీ స్పష్టత ఉండాలి. ప్రజాసేవ చేయాలనుకోవటం కావొచ్చు. సమాజంలో మార్పు తేవాలనుకోవటం, ప్రజలతో కలిసిమెలిసి ఉండటం, గొప్ప హోదా, అడ్మినిస్ట్రేషన్‌లపై ఆసక్తి..ఇలా ఏదైనా కావొచ్చు.ఆ కారణం నిజాయతీగా ఉండాలి. అది మనసులో ఉంచుకుని, ప్రతిరోజూ గుర్తు చేసుకుంటూవుండాలి. నిరంతర ప్రేరణకు ఇది చాలా ముఖ్యం.

* నేను ఇంగ్లిష్‌ మాట్లాడలేను. నాలాంటివారు సివిల్స్‌ నెగ్గే వీలుందా?  
ఈ పరీక్ష నెగ్గటానికి ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు. ఇంగ్లిష్‌లో చదివి, సబ్జెక్టును అర్థం చేసుకోగలిగితే చాలు. ఏమైనా సమస్య ఉంటే నిఘంటువు, గ్రామర్‌ పుస్తకాల సాయం తీసుకుని చదువుకోవచ్చు. అవసరమే దేన్నయినా నేర్పుతుంది. నెగ్గితీరాలన్న తపనే.. పోటీలో ముందు నిలిచేలా చేస్తుంది.
* స్కూల్లో, కాలేజీలో నాకు మంచి మార్కులు ఎన్నడూ రాలేదు. నా మిత్రులు కొంతమంది సివిల్స్‌ రాస్తానంటే ‘ నీ వల్ల ఏమవుతుంది? ఎందుకూ అనవసరంగా?’ అంటూ నిరుత్సాహపరుస్తున్నారు. సివిల్స్‌ అంత కష్టమా?
ఈ పరీక్ష కోసం చాలా కష్టపడాల్సివుంటుందన్నది నిజమే. అయితే స్కూలు, కాలేజీ మార్కులు దీనికి ప్రామాణికం కాదు. సివిల్స్‌ పరీక్షా పద్ధతి, సిలబస్‌లను అధ్యయనం చేసి, ఆ పరీక్ష ఆశించే లక్షణాలనూ, ఆలోచనావిధానాన్నీ పెంపొందించుకుని, తగిన నైపుణ్యాలు పెంచుకోవాలి. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరి అనుభవాలను బట్టి వారు సలహాలిస్తుంటారు. వాటిని వినొచ్చు గానీ నిర్ణయం ఏదైనా స్వయంగా ఆలోచించే తీసుకోవాలి. పరీక్ష రాయాలన్న స్థిరమైన నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి కృషి చేయండి.
* పరీక్షకు సిద్ధమవటం ఏ వయసులో మొదలుపెడితే మేలు?
‘ఇదే సరైన వయసు’ అనేది ఏమీ లేదు. నిబంధనల ప్రకారం 21-32 సంవత్సరాల వయసున్నవారు రాయటానికి అర్హులు. కానీ లభిస్తున్న గణాంకాలను విశ్లేషిస్తే... ఎక్కువమంది డిగ్రీ తర్వాత 21-22 సంవత్సరాల వయసులో ప్రిపరేషన్‌ ప్రారంభిస్తున్నారు. 26-28 సంవత్సరాల వయసు తర్వాత కూడా సివిల్స్‌ రాస్తున్నవారు ఉన్నారు. కాబట్టి వయసు కాస్త తక్కువైనా, కొంచెం ఎక్కువైనా దానికేమీ ప్రాధాన్యం ఉండదు.
ఇక సివిల్స్‌ సన్నద్ధతకు అత్యుత్తమమైన సమయం ఏదంటే.. అది ఇప్పుడే!
ఊగిసలాటతో కాలయాపన చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. స్థిరమైన నిర్ణయం తీసుకుని వెంటనే కార్యరంగంలోకి దిగిపోవటమే సరైనది!

* ఈ పరీక్షకు ఎంత కాలం ప్రిపేరవ్వాల్సివుంటుంది?
ఏడాది కాలం సన్నద్ధమైతే పునాది ఏర్పడి, సిలబస్‌పై పూర్తి అవగాహన వస్తుంది. సిలబస్‌పై తయారవటం వేరు; పరీక్షకు ధీమాగా హాజరవ్వటం వేరు. మళ్లీ పరీక్షకు హాజరవ్వటం వేరు; సొంత పొరపాట్ల నుంచి నేర్చుకుని పరీక్షలో నెగ్గటం వేరు! ఈ ప్రక్రియ మొత్తానికీ కనీసం 3-4 సంవత్సరాలైనా పడుతుంది. దీనికి మానసికంగా అన్నివిధాలా సిద్ధమై, లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం మంచిది.
* నాకు ఉద్యోగం ఉంది. నా కార్యాలయ విధులు సివిల్స్‌ రాయటానికి ప్రతిబంధకమా?
సమయం, వనరులు, ఏకాగ్రత, బాధ్యతల పరంగా ఉద్యోగులకు మిగతావారితో పోలిస్తే పరిమితులుంటాయనేది నిజమే. అయితే నిజానికి ఇవేమీ దాటరాని అడ్డంకులైతే కావు. సరైన ప్రణాళిక, ప్రయత్నాలతో వీటిని గరిష్ఠంగా అధిగమించవచ్చు. స్థిర సంకల్పం, కార్యాచరణ ఉంటే 8 గంటల ఉద్యోగ బాధ్యతలు మీ లక్ష్యసాధనను ఆపలేవు.
- వి. గోపాలకృష్ణ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.