close

తాజా వార్తలు

Updated : 02/03/2021 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ మూడు అంశాల్లో మార్పు కనిపించాలి: జగన్‌

సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి
ప్రజారోగ్యంలో నాడు-నేడుపై సీఎం సమీక్ష

అమరావతి: కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటే వినిపించకూడదని.. ఎంత మంది అవసరమైతే వారందరినీ నియమించుకోవాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తదితరులు హాజరయ్యారు. ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలని.. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

నిధుల కొరత లేకుండా చూడండి

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త నిర్మాణాలపై సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు. వైద్యం, విద్యా రంగాల్లో నాడు-నేడు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోపు పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూసేకరణ, ఇతరత్రా ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని.. అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

ఆ మూడు అంశాల్లో కచ్చితమైన మార్పు కనిపించాలి

మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలని సీఎం చెప్పారు. బెడ్‌షీట్ల దగ్గర నుంచి శానిటేషన్‌ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. రోగులకు ఇచ్చే గది, పడకలు, ఆస్పత్రి వాతావరణం, రోగులకు అందిస్తున్న భోజనం.. ఈ మూడు అంశాల్లో కచ్చితంగా మార్పులు కనిపించాలన్నారు. ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని.. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారుచేయాలని సీఎం నిర్దేశించారు. ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు.


 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని