close

తాజా వార్తలు

Updated : 11/02/2021 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాలనలో జాగ్రత్తగా వ్యవహరించాలి: కేసీఆర్

హైదరాబాద్‌: భాగ్యనగర వైభవం పెంచేలా కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి పాటుపడాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, తెరాస కార్పొరేటర్లు ప్రగతిభవన్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ కార్పొరేటర్లకు పలు సూచనలు చేశారు. కొద్ది మందికే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం లభిస్తుందని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

మంచిగుంటేనే బట్ట కాల్చి మీదేసే రోజులివి..

‘‘విభిన్న ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతోంది. నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలి. కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగుంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావొద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడొద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించి అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనైన సాయం చేయాలి. అబద్ధాలు చెప్పొద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.

నగర వైభవాన్ని పెంచండి

‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’ అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి. హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉంది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్ కాలనీ ఉంది. గుజరాతీ గల్లీ ఉంది. పార్సీ గుట్ట ఉంది. బెంగాలీలు, మలయాళీలు, మార్వాడీలు ఉన్నారు. ఇలా విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమ గల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉంది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి. ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్‌ అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేం. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’’ అని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌ మేయర్‌గా విజయలక్ష్మీ

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని