close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 19/04/2020 23:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మే 5న మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం
ఎలాంటి సడలింపుల్లేవ్‌
కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 3న ముగియనుండగా.. తెలంగాణలో మాత్రం మే7వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌లో ఎలాంటి సడలింపులూ ఉండబోవని చెప్పారు. లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీని నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఇంట్లో అద్దెకుండే వారిని యజమానులు అద్దె కోసం ఇబ్బంది పెట్టొద్దని, అలాగే ఈ ఏడాది స్కూలు ఫీజులు పెంచొద్దని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. ఈ మేరకు  కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కేసుల్లేవని చెప్పారు. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసూ లేదని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సడలింపులూ, పరిస్థితుల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణలో ఈరోజు కొత్తగా 18 కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 858కి చేరిందని చెప్పారు. వీరిలో 21 మంది మృతి చెందారని.. 186 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 651 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎం వివరించారు.

మే 1 వరకు కొత్త కేసుల సంఖ్య తగ్గే పరిస్థితి లేదని.. గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అలాగే కొనసాగుతాయని కేసీఆర్‌ చెప్పారు. పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మే 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.‌ మే 5న మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 1897 ఎపిడమిక్‌ డిజాస్టర్ నిర్వహణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటాయని.. దాని ప్రకారమే కేబినెట్‌ లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకుందని సీఎం వివరించారు. 

సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు

‘‘లాక్‌డౌన్‌పై ఉమ్మడి 10 జిల్లాల నుంచి సుమారు 100 మందితో మాట్లాడా. వారిలో న్యాయవాదులు, యువకులు, వైద్యులు, రైతులు, రైతు కూలీలు ఇలా.. అన్ని వర్గాల వారు ఉన్నారు. వాళ్లలో చాలా
మంది లాక్‌డౌన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే అని చెప్పారు. లాక్‌డౌన్‌ మే7 వరకు పొడిగించినందున రాత్రిపూట కర్ఫ్యూ అలాగే కొనసాగుతుంది. ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేబినెట్‌లో నిర్ణయించాం. పరిస్థితిని బట్టి మే 5న కేబినెట్‌ భేటీలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి పండగలైనా ఇళ్లలోనే జరుపుకోవాలి. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. రంజాన్‌ మాసం ప్రారంభమైనా సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు’’

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీపై నిషేధం

‘‘దిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌ ద్వారా 69 మందికి వైరస్‌ సోకింది. అందుకే రేపటి నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలను నిషేధిస్తున్నాం. స్విగ్గీ, జొమాటో సహా అన్నింటిపైనా నిషేధం కొనసాగుతుంది. నిత్యావసరాలు సరఫరా చేసేవాళ్లకి ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మే 7 వరకు దేశీయ విమాన ప్రయాణికులెవరూ రాష్ట్రానికి రావొద్దని కోరుతున్నా. వస్తే రవాణా సదుపాయాల్లేక ఇబ్బంది పడతారు. ‘రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అద్భుతంగా చేస్తున్నారు. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్లు అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. మే నెలలోనూ తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ  రూ.1500, ఒక్కో వ్యక్తికి 12కిలోల బియ్యం అందజేస్తాం’’

ఈ విద్యా సంవత్సరంలో ఫీజు ఒక్కపైసా కూడా పెంచొద్దు

‘‘అద్దెకుండే వాళ్ల నుంచి యజమానులు మూడు నెలల వరకు అద్దె కోసం ఇబ్బంది పెట్టొద్దు. వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి. అలా అని వడ్డీ వసూలు చేయొద్దు. ఇది ప్రభుత్వ ఆదేశం. యజమానులు ఇబ్బంది పెడితే డయల్‌ 100కి కాల్ చేసి చెబితే చర్యలు తీసుకుంటాం. వివిధ పరిశ్రమల యజమానుల విజ్ఞప్తి మేరకు మే నెలకు సంబంధించి పరిశ్రమల ఫిక్స్‌డ్ ఛార్జీలు రద్దు చేస్తున్నాం. పింఛనుదారులకు ఈనెల 75 శాతం పింఛను చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. మే నెల ఆసరా పింఛన్లు అందిస్తాం. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఒక్క పైసా కూడా ఫీజులు పెంచకూడదు. ఇతరత్రా ఎలాంటి ఫీజూ లేకుండా కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలి. సంవత్సరం మొత్తం ఒకేసారి చెల్లించాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. ప్రజలు ఆదాయం కోల్పోయారు. ఈ సమయంలో వారిని మరింత కష్టపెట్టడం ధర్మం కాదు. అలా చేసిన విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయడంతో పాటు కఠినచర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఆదేశాలను కచ్చితంగా పాటించాలి’’ 

రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు

‘‘రైతులు పండించిన ప్రతి పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా కొనసాగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. సుమారు మరో నెలరోజుల పాటు వేడుకలకు అనుమతివ్వం. కల్యాణ మండపాలను ఎరువులు, పంటల నిల్వకు వాడుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. ప్రజలెవరూ బ్యాంకుల వద్ద గుమిగూడవద్దు.  ప్రభుత్వం ఒకసారి ఖాతాలో వేసిన డబ్బు వెనక్కి పోదు. కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలెవరూ బ్యాంకుల వద్ద గుమిగూడవద్దు. వలస కూలీ ఒక్కరే అయితే 12 కిలోల బియ్యం, రూ.500.. కుటుంబం అయితే ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు అందజేస్తాం’’

గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఆ తర్వాత టిమ్స్‌గా..

‘‘గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌లో ఉన్న 540 గదుల భవనాన్ని క్రీడాశాఖ నుంచి వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. యుద్ధ ప్రాతిపదికన 1500 పడకల కరోనా ప్రత్యేక ఆస్పత్రిని సిద్ధం చేశాం. ఆ తర్వాత కూడా దాన్ని వాడుకునేందుకు వీలుగా ఆ ఆస్పత్రికి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (టిమ్స్‌)గా నామకరణం చేశాం. పూర్తిస్థాయిలో దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతుంది. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ నేతృత్వంలో సమగ్ర క్రీడా విధానం కోసం కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సబ్‌కమిటీ నివేదిక రూపొందిస్తుంది. పోలీసులకు వారి మూల వేతనంపై 10 శాతం సీఎం గిఫ్ట్‌ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. విద్యుత్‌శాఖలోని 34,512 మంది కార్మికులకు 100 శాతం వేతనం ఇవ్వాలని నిర్ణయించాం. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రాలకు కేంద్రం అవసరమైన వెసులుబాటులు ఇవ్వాలి. ఈ విషయంలో తాత్సారం చేయకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’’ అని కేసీఆర్‌ చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.