close

తాజా వార్తలు

Published : 25/01/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు శాఖల ప్రాధాన్యం పెరిగింది: కేసీఆర్‌

వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఈ రెండు శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందన్నారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్‌ అంశాలపై మంత్రులు, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులు, ప్రాంతీయ అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు.

దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన సమావేశంలో.. రాష్ట్రంలో పంటల విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సి వ్యూహాలు, విధానాలపై అధికారులతో చర్చించారు. పంటల సాగుపై రైతులకు ఎలా అవగాహన కల్పించాలనే అంశంపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగులో ఉందనే వివరాలను పది రోజుల్లోగా అందించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తీసుకొచ్చి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలో భాగంగానే ఉండాలని.. ఇందుకు అవసరమైన ఫర్నిచర్‌, ఇతర వసతులు కల్పించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఎన్నో అద్భుత విజయాలు సాధించాం..
‘‘కనీవినీ ఎరుగని స్థాయిలో తెలంగాణ ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి అగ్రస్థానంలో నిలిచాం. ఇది కేవలం మిషన్ భగీరథ వల్లే సాధ్యమైంది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలను పరిష్కరించుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వగలుగుతున్నాం. రెవెన్యూ శాఖలో అత్యంత జటిలమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను సులభతరం చేసుకున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. అన్ని రంగాల్లోనూ ఎన్నో అద్భుత విజయాలను సాధించుకున్నాం.

రైతులకు అండగా నిలవాలి

వసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1.10 కోట్ల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించుకోవడం సాధ్యపడుతుంది. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతుంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి.

పంట మార్పిడి విధానం రావాలి
రాష్ట్రంలో రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. దీనివల్ల వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు అవలంబించాలి. ఈ అంశాలపై వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. రైతులతో సమావేశాలు నిర్వహించి పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి’’ అని తెలిపారు.

ఇవీ చదవండి..
యాదాద్రి.. కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: కేటీఆర్‌

ఫోన్‌ ఛార్జింగ్‌..మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని