బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 22/06/2021 17:27 IST

బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్‌

వాసాలమర్రి: ఏడాది గడిచే సరికి గ్రామం బంగారు వాసాలమర్రి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వాసాలమర్రికి అండగా ఉంటుంది. పరిసర గ్రామాలకు వాసాలమర్రి ఆదర్శంగా నిలవాలి. గ్రామస్థులంతా పట్టుదలతో కలిసికట్టుగా అనుకున్నది సాధించాలి. గ్రామంలో ఎలాంటి కేసులు ఉండకుండా చూసుకోవాలి. ఇంటింటికీ లబ్ధి చేకూర్చేలా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తాం. వాసాలమర్రి గ్రామానికి మరో 20 సార్లయినా వస్తా. కులాలు, పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే: కేసీఆర్‌
‘‘వాసాలమర్రి గ్రామస్థులు అంకాపూర్‌ అభివృద్ధి చూసి వచ్చారు. అంకాపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీనే గ్రామస్థులకు సుప్రీంకోర్టు. అంకాపూర్‌ సర్పంచికి కూడా రెండుసార్లు జరిమానా విధించారు. ఏళ్లుగా పోలీసులు వెళ్లని విధంగా అంకాపూర్‌ తయారైంది. కులం, మతం తేడా లేకుండా అందరూ కలిసి రావాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీకైనా ఓటు వేయవచ్చు. వాసాలమర్రి అభివృద్ధికి గ్రామస్థులంతా ప్రతిజ్ఞ చేయాలి. గతంలో సిద్దిపేట జిల్లా రామునిపట్నం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. గ్రామంలో రెక్కల కష్టంపై బతికేవాళ్లకు అండగా నిలవాలి. గ్రామ అవసరాలు ఇక్కడ లభించే వనరుల ద్వారా తీర్చుకోవాలి. గ్రామస్థులంతా వారానికి 2గంటలు పనిచేస్తే అభివృద్ధి జరగదా? గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ్టి నుంచి వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఇస్తాం. గ్రామంలో జబ్బుపడిన వారికి ప్రభుత్వం తరఫున చికిత్స అందిస్తాం. గ్రామంలో అర్హులైనవారికి రేషన్‌ కార్డులు అందిస్తాం. గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించుకుందాం. గ్రామంలో రహదారులు చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు వివరించాలి. జనాభా ఆధారంగా గ్రామఅభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. శ్రమదాన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. పరిశుభ్రత, తాగునీటి కోసం కమిటీ ఏర్పాటు చేయాలి. రైతులంతా కలిసి వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాభివృద్ధి నిధికి ప్రతి కుటుంబం సహకరించాలి. గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామపంచాయతీలకు సీఎం నిధి నుంచి  ఒక్కో పంచాయతీకి రూ.25లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నా. జిల్లాలోని  6 మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తున్నా’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని