మోదీజీ.. నేను మీ పార్టీ కాదు..! 
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీజీ.. నేను మీ పార్టీ కాదు..! 

‘రెండో సీటు’ వ్యాఖ్యలపై ప్రధానికి దీదీ చురకలు

కూచ్‌బెహార్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్డారు. తాను మరెక్కడా పోటీ చేయాల్సిన అవసరం లేదని, నందిగ్రామ్‌ నుంచి తన గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రెండో దశ పోలింగ్‌ నేపథ్యంలో గురువారం వరకు నందిగ్రామ్‌లోనే ఉన్న దీదీ.. ఈ ఉదయం కోల్‌కతా చేరుకున్నారు. అక్కడి నుంచి కూబ్‌బెహార్‌ వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, భాజపా నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘మోదీజీ.. మరో సీటు నుంచి పోటీ చేయాలని మీరు సలహా ఇచ్చేందుకు నేను మీ పార్టీ సభ్యురాలిని కాదు’’ అని దుయ్యబట్టారు. నందిగ్రామ్‌ నుంచి తాను తప్పకుండా విజయం సాధిస్తానని, ఇందులో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తనతో పాటు కనీసం 200 మంది తృణమూల్‌ అభ్యర్థులు గెలవాలని అన్నారు. అందుకుని ప్రజలంతా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 200 సీట్లకు పైగా గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీదీ విశ్వాసం ప్రకటించారు. 

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బలగాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్‌ను అమిత్ షా నియంత్రిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలు భాజపా తరఫున పనిచేస్తున్నాయని, రాత్రి వేళల్లో గ్రామాలకు వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్నాయన్నారు. అలాంటి వాళ్లకు భయపడొద్దని, తిరగబడాలని ప్రజలకు సూచించారు. 

హావ్‌డా జిల్లా ఉలుబేడియాలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. మమతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘మమతా బెనర్జీని గద్దె దించాలని బెంగాల్‌ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్‌ ప్రజలు ఆ కలను నెరవేరుస్తున్నారు. ఎప్పుడూ విజయం సాధించే భవానీపుర్‌ను ఎందుకు వదులుకున్నానా అని ఆమె ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె మరో నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేయాలని అనుకుంటున్నారట. ఈ వదంతుల్లో నిజమెంత? మమత వివరణ ఇవ్వాలి. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని అన్నారు. అయితే, ప్రధాని వ్యాఖ్యలను తృణమూల్‌ తీవ్రంగా ఖండించింది. దీదీ మరో చోట నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని