close

తాజా వార్తలు

Published : 02/03/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా తమిళ సంస్కృతిని గౌరవించదు: రాహుల్‌

చెన్నై: తమిళనాడులో ఎన్నికల వేళ భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య విమర్శల పర్వం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలంటే గౌరవం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించకుండా.. కేంద్రం చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం కన్యాకుమారిలో నిర్వహించిన రోడ్‌షోలో భాజపాపై, పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

‘‘తమిళ సంస్కృతిని అవమానించేలా ఆర్‌ఎస్‌ఎస్‌కు పళనిస్వామి అవకాశం ఇవ్వొద్దు. మరోవైపు మోదీ‘ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర’ అని చెబుతున్నారు. మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర, సంస్కృతి భారత దేశానికి చెందినవి కావా? ఒక భారతీయుడిగా.. తమిళ సంస్కృతిని కాపాడటం నా ధర్మం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. 

‘ప్రధాని మోదీ సహా కేంద్రంలోని నాయకులు ఎవరూ తమిళ సంస్కృతిని గౌరవించరు. ఇక్కడ ఉన్న సీఎం కేంద్రంలో ఉన్నవారు ఏం చెబితే అదే చేస్తారు. ఆయన రాష్ట్రానికి సీఎంగా వ్యవరించడం లేదు. మోదీకి ఏం కావాలో ఆయన అది చేస్తుంటారు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు, చిన్న స్థాయి వ్యాపారులు, కూలీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎదురుచూస్తోందన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ నాటి మద్రాస్‌ సీఎంగా సేవలందించిన కుమారస్వామి కామరాజ్‌ నాయకత్వ పటిమను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆర్థిక వేత్తలు వద్దన్నా పట్టించుకోకుండా.. ప్రజల మాట విని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. 

ఇటీవల పుదుచ్చేరి పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పార్టీపై, మాజీ సీఎం నారాయణ స్వామిపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాగా, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని