close
Array ( ) 1

తాజా వార్తలు

రెండు ఓటములు.. ఒక గుణపాఠం

అప్పుడు విరాట్‌ సేన.. ఇప్పుడు ప్రియమ్‌ సేన..

ప్రపంచకప్‌లను దూరం చేసుకున్న టీమ్‌ఇండియా

యుద్ధం గెలిచేందుకు అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు పది. తొమ్మిదింటిపై అవగాహన ఉంది. ప్రయోగించడంలో నైపుణ్యమూ ఉంది. ఆఖరి అస్త్రమూ శక్తిమంతమైందే. దాని అవసరం లేకుండానే విజయం సిద్ధిస్తుండటంతో ఎక్కడో చిన్న చూపు! సాన పెట్టకున్నా ఫర్వాలేదులే అన్న ధీమా!

చిన్న చిన్న యుద్ధాలైతే ఏముంది గానీ జరిగేది ప్రపంచ సమరమైతే? కీలక సమయంలో ప్రత్యర్థి ముందు ఆ తొమ్మిది అస్త్రాలు విఫలమైతే?? రక్షించేది ఆఖరి ఆయుధమేగా!  అలాంటప్పుడే కర్ణుడిలా మంత్ర ప్రయోగం మరిచిపోతే??? ఓటమే గతి. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో విరాట్‌ సేన, అండర్‌-19 ప్రపంచకప్‌లో ప్రియమ్‌ సేనదీ అదే స్థితి. మిడిలార్డర్‌ కుప్పకూలడంతో వచ్చిన దుస్థితి. మార్చుకోవాల్సిన పరిస్థితి.


అక్కడి వ్యథే.. ఇక్కడి  కథ

చూసేందుకు యుద్ధం, ఆట ఒకేలా ఉండవు. వ్యూహ ప్రతివ్యూహాల్లో మాత్ర సారూపత్యం ఉంటుంది. ప్రణాళికలు రచించడం, ఒకటి విఫలమైతే మరోటి సిద్ధంగా ఉంచుకోవడం, పరిస్థితులను బట్టి కచ్చితత్వంతో వాటిని అమలు చేయడం ఒక కళ. అంతకుమించి అవసరం. సీనియర్‌, జూనియర్‌ ప్రపంచకప్‌ సమరాల్లో భారత జట్లలో కనిపించనిది ఇదే. మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నట్టు విరాట్‌, ప్రియమ్‌ సేనల సన్నద్ధత ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. రెండు బృందాల్లోనూ టాప్‌ ఆర్డర్‌ భీకరం. బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠం. ఇటు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, చాహల్‌, జడ్డూ.. అటు కార్తీక్‌ త్యాగి, రవి బిష్ణోయ్‌తో కూడిన ప్రమాదకరమైన బౌలింగ్‌ దాడి. ఎటొచ్చీ లోపించింది మిడిలార్డర్‌ దన్ను.


అక్కడ రోహిత్‌.. ఇక్కడ జైశ్వాల్‌

 ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన లీగు మ్యాచుల్లో పరుగుల వరద పారించింది. వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించింది. ఐదు శతకాలతో రోహిత్‌శర్మ దుమ్మురేపితే శిఖర్‌ ధావన్‌ ఓ సెంచరీతో రాణించాడు. విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రతి పోరులో టాప్‌ ఆర్డర్‌లో కనీసం ఇద్దరు రాణించారు. మిడిలార్డర్‌ను పరీక్షించేంతగా పరిస్థితి రాలేదు. దక్షిణాఫ్రికాలో ప్రియమ్‌ సేనదీ అదే తరహా. యశస్వి జైస్వాల్‌, దివ్యాన్స్‌ సక్సేనా, తిలక్‌ వర్మ విజృంభించి ఆడారు. పరుగులు చేశారు. మ్యాచులు ఆఖరి వరకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. పాకిస్థాన్‌తో సెమీస్‌లోనైతే 10 వికెట్ల తేడాతో లక్ష్యం ఛేదించారు. అప్పుడు హిట్‌మ్యాన్‌ 9 ఇన్నింగ్స్‌లో 81 సగటుతో 648 పరుగులు చేయగా ఇప్పుడు జైశ్వాల్‌ 6 ఇన్నింగ్స్‌లో 133.33 సగటుతో 400 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.


అప్పుడు బుమ్రా.. ఇప్పుడు బిష్ణోయ్‌

సీనియర్‌ ప్రపంచ సమరంలో జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను చూసి ప్రత్యర్థులు గడగడ వణికారు. అతడు 9 మ్యాచుల్లో 84 ఓవర్లు విసిరాడు. అందులో 9 మెయిడిన్లు ఉన్నాయి. 20.61 సగటు, 4.41 ఎకానమీతో 18 వికెట్లు తీశాడు. ఇలాంటి ఎకానమీ, మెయిడిన్ల రికార్డు మెగాటోర్నీలో ఎవరికీ లేవు. మహ్మద్‌ షమి సైతం అంతే. 4 మ్యాచుల్లోనే 14 వికెట్లతో సంచలనం సృష్టించాడు. సగటు 13.78, ఎకానమీ 5.48. ఇక జూనియర్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌.. బాబోయ్‌! అనిపించాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 52 ఓవర్లు విసిరి 6 మెయిడిన్‌ చేశాడు. 10.64 సగటు, 3.48 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. 181 పరుగులు ఇచ్చాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. గింగిరాలు తిరిగే బంతులతో మూడు సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించడం మరీ ప్రత్యేకం. ఇలాంటి గణాంకాలు టోర్నీలో మరెవ్వరికీ లేవు. కార్తీక్‌ త్యాగి సైతం తన పేస్‌తో ఔరా! అనిపించాడు. 6 ఇన్నింగ్సుల్లో 13.90 సగటు, 3.45 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు ఫర్వాలేదనిపించారు.


అక్కడా.. ఇక్కడా పరీక్షల్లేవ్‌

రెండు జట్లకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ మాదిరిగానే మిడిలార్డర్‌లోనూ సారూప్యతలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌ తరహాలోనే సఫారీ గడ్డపైనా కుర్రాళ్ల బ్యాటింగ్‌ డెప్త్‌ను పరీక్షించే పరిస్థితులు రాలేదు. గతేడాది ప్రపంచ పోరులో రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌, ధావన్‌దే హవా. వారు విఫలమైతే ఎంఎస్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా ఉన్నారులే అన్న ధీమా. యువ భారత్‌లోనూ అంతే. కథంతా ఓపెనర్లు యశస్వి, సక్సేనా నడిపించారు. ఏమన్నా జరిగితే చూసుకోవడానికి కెప్టెన్‌ ప్రియమ్‌గార్గ్‌, ధ్రువ్‌ జురెల్‌, సిద్ధేశ్‌ వీర్‌, అథర్వ అంకోలేకర్‌ ఉన్నారుగా అన్న ధైర్యం. కానీ అక్కడా.. ఇక్కడా కీలక మ్యాచుల్లో చేతులెత్తేసింది మిడిలార్డరే.


చేతులెత్తేసిన మిడిలార్డర్‌

వాస్తవంగా కోహ్లీసేనలో నాలుగో స్థానంపై స్పష్టతే లేదు. ప్రయోగాలెన్నో చేసి రాహుల్‌, పాండ్య, కార్తీక్‌, పంత్‌, విజయ్‌ శంకర్‌ను ఆడించారు. ధావన్‌ గాయపడి కేఎల్‌ టాప్‌ ఆర్డర్‌కు వెళ్లగానే మిగతా వాళ్లలో ఎవరూ స్థిరంగా ఆడలేదు. జూనియర్‌ జట్టు పరిస్థితి మరోలా ఉంది. రెండు సార్లు మాత్రమే మిడిలార్డర్‌ ఆడింది. చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్లో శతకాల మోత మోగించిన ప్రియమ్‌ గార్గ్‌ అనూహ్యంగా విఫలమయ్యాడు. ఫైనల్లో టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలినప్పుడు ఆదుకోలేకపోయాడు. అందుకే టీమ్‌ఇండియా బంగ్లాకు కాపాడుకోగల లక్ష్యం నిర్దేశించలేకపోయింది. మరో సంగతేంటంటే ఈ టోర్నీ సాంతం బంగ్లాదేశ్‌ను గెలిపించింది మిడిలార్డరే! నిజానికి యువ భారత జట్టు కలిసికట్టుగా ఆడిన సందర్భాలు తక్కువుంటాయి. స్థిరమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను రూపొందించేందుకు సీనియర్ల తరహాలో వాళ్లకు మ్యాచులుండవు. అందుకే వారిపై విమర్శలకు తావులేదు. కానీ రెండు జట్లు రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒకేలా ఓడటమే బాధాకరం!!!

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.