దేశంలో కఠిన లాక్‌డౌన్‌ అవసరం: ఎయిమ్స్‌ చీఫ్‌
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో కఠిన లాక్‌డౌన్‌ అవసరం: ఎయిమ్స్‌ చీఫ్‌

ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో విలయమే..

దిల్లీ: కరోనా విజృంభణతో దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయని.. ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్‌డౌన్‌ (Lockdown) అవసరమని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణ్‌దీప్‌ గులేరియా (Randeep Guleria) అభిప్రాయపడ్డారు. రాత్రి కర్ఫ్యూలు (Night Curfew), వారాంతపు లాక్‌డౌన్‌లతో పెద్దగా ఉపయోగం లేదని.. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్‌డౌన్‌ అవసరమన్నారు. ఓ ఇంటర్వ్యూలో గులేరియా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధిస్తున్నా... ప్రభావం చూపలేకపోతున్నాయనే విషయం స్పష్టమవుతోందన్నారు. వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోందన్నారు.

దేశంలో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతోందని.. దిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ (Oxygen) అందక 12 మంది మరణించడం, అందులో ఓ వైద్యుడు ఉండటం అత్యంత బాధాకరమని గులేరియా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆ వైద్యుడు తనకు తెలుసన్నారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారని.. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని ఆయన హెచ్చరించారు. ‘ఆసుపత్రుల్లో రోగులు పెరిగిపోతుండటంతో వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయదు. కేసులను తగ్గించేందుకు కఠిన లాక్‌డౌన్‌ విధించడం లేదా ఇంకేదైనా మార్గముంటే అమల్లోకి తీసుకురావాలి’ అని సూచించారు. 

‘టీకాలు వస్తున్నాయని ప్రజల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పడి ఇక కరోనా మనల్ని ఏం చేయదనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే అనేక మంది కరోనా నిబంధనలు పాటించడం లేదు. మనలో హెర్డ్‌ ఇమ్యూనిటీ (Herd Immunity) ఉందని.. వైరస్‌ దరిచేదనే భావనలో ఉన్నాం. కానీ వైరస్‌లో మార్పులు ఏర్పడితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వైరస్‌ను తట్టుకోలేదు. అప్పుడు మహమ్మారి కార్చిచ్చులా వ్యాపిస్తూ వినాశనం సృష్టిస్తుంది’ అని గులేరియా హెచ్చరించారు. రాజధాని దిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం ఏర్పడుతుండటంతో సరఫరాను సమన్వయం చేయాలని.. బ్యాకప్ చేసేలా ‘సెంట్రల్ కమాండ్’ ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విధానంతో చికిత్సలో ఆలస్యం జరిగినా ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కానీ ఇలాగే కొనసాగితే దిల్లీ, మహారాష్ట్రలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత అధ్వానంగా మారతాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని