close

తాజా వార్తలు

Updated : 31/08/2020 21:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది

ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల ప్రముఖుల సంతాపం

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) మరణం దేశానికి తీరని లోటని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రార్థించారు.

‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంతో ఓ శకం ముగిసిపోయింది. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనది. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

- రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

‘‘భారత్‌రత్న ప్రణబ్‌ ముఖర్జీ మరణ వార్త విని దేశం మొత్తం విలపిస్తోంది. దేశ అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయనో గొప్ప రాజనీతిజ్ఞుడు. అటు రాజకీయ వర్గాల్లోనే కాక, సామాన్యుల నుంచి సైతం మెప్పు పొందిన గొప్ప వ్యక్తి’’

-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

‘‘మాజీరాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం నన్ను కలచివేసింది. దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఎంతో శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో దేశ రాజ్యాంగ అత్యున్నత పదవిని చేపట్టారు. ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి

‘‘ప్రణబ్‌ ముఖర్జీ మాతృభూమికి ఎనలేని సేవలు అందించారు. ప్రణబ్‌ మృతితో దేశం పెద్ద రాజకీయ నేతను కోల్పోయింది’’

-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

‘‘ప్రణబ్‌జీ మరణవార్తతో దేశం మొత్తం దుఖః సాగరంలో మునిగిపోయింది. యావత్‌ దేశంతో పాటు నేను కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’’

-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత 

‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి ప్రణబ్‌ నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్‌కు నివాళులు అర్పిస్తున్నా.’’

-కె. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి

‘‘ప్రణబ్‌ ముఖర్జీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారు. క్లిష్ట సమస్యల పరిష్కారంలో ప్రణబ్‌ పరిణతి ప్రదర్శించారు. రాజకీయ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లారు.’’

- వైఎస్‌. జగన్‌, ఏపీ ముఖ్యమంత్రి

‘‘తీవ్రమైన దుఖఃంతో రాస్తున్నా. భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లిపోయారు. ఒక శకం ముగిసింది. నేను తొలిసారి ఎంపీగా గెలుపొందినప్పుడు ఆయన సీనియర్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను సీఎంగా ఉన్నా. ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రణబ్‌ దాదాలేని దిల్లీ పర్యటన ఊహించుకోలేకపోతున్నా. రాజకీయాల నుంచి ఆర్థికశాస్త్రం దాకా అన్ని అంశాల్లో ఆయనొక లెజెండ్‌.  అభిజిత్‌, శర్మిష్ఠకు ప్రగాఢ సానుభూతి’’

- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ సీఎం

‘‘కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిని దేశం కోల్పోయింది. ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి లోటు. 60 ఏళ్ల రాజకీయాల్లో ప్రణబ్‌ ముఖర్జీ వివాదరహితుడు. ప్రణబ్‌ నిరాడంబరత, నిబద్ధత, నిజాయతీ అందరికీ ఆదర్శం’’

-చంద్రబాబు, తెదేపా అధినేత


‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన ఆయన మరణం దేశానికి తీరని లోటు. ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుబూతి తెలియజేస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్‌ ముఖర్జీ విలక్షణమైన ధ్రువతారగా వెలిగారు. రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినా తన మూలాలను మరచిపోని ఆయనలోని విలక్షణత నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయం. అనుసరణీయం’’

- పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన