
తాజా వార్తలు
జూన్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు !
సీడబ్ల్యూసీలో నిర్ణయం
దిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది జూన్లో కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో నిర్ణయం తీసుకున్నారని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. కొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన అనంతరం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు.
గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముఖుల్ వాస్నిక్, చిదంబరం వంటి సీనియర్ నేతలు మాత్రం వెంటనే సంస్థాగత ఎన్నికలు జరపాలని పట్టుబట్టినట్లు సమాచారం. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ చవిచూస్తున్న వరస వైఫల్యాలపై వీరు ఇప్పటికే పార్టీ నాయకత్వం, నిర్వహణపై ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబ విధేయులు, అసమ్మతి వ్యక్తం చేసిన నేతలు రెండు వర్గాలుగా విడిపోయి..ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘మొదట ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలి. తరవాత పార్టీ అంతర్గత ఎన్నికల గురించి ఆలోచించాలి’ అని అశోక్ గహ్లోత్, ఊమెన్ చాందీ వంటి విధేయుల గ్రూప్ వెల్లడించిందని పేర్కొన్నాయి. చివరకు వారి మాటే నెగ్గింది. జూన్లో అధ్యక్ష ఎన్నిక జరిపేందుకు సమావేశంలో నిర్ణయించారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు. గాంధీయేతరులకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్కు ఎదురవుతున్న వైఫల్యాల నేపథ్యంలో..పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం ఉండాలంటూ అసమ్మతి వర్గం లేఖ రూపంలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం వెలువడింది.
ఇవీ చదవండి: