
తాజా వార్తలు
పీఎస్ఎల్లో కరోనా కలవరం
కరాచి: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరోనా కలకలం రేపుతోంది. సోమవారం ఆస్ట్రేలియాకు చెందిన ఫవాద్ అహ్మద్ (ఇస్లామాబాద్ యునైటెడ్) పాజిటివ్‌గా తేలడంతో.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌ను తర్వాతి రోజుకు వాయిదా వేయగా.. తాజాగా మరో మూడు కేసులు బయటపడడంతో ఆందోళన రెట్టింపైంది. ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు ఒక సహాయక సిబ్బందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది. వారిని వెంటనే ఐసొలేషన్‌కు తరలించారు. వీరిలో ఒకరు ఫవాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన ఆటగాడు కాగా.. మిగిలిన ఇద్దరు వేర్వేరు జట్లకు చెందిన వాళ్లు. మరో జట్టుకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా టోర్నీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే బయో బుడగ నిబంధనలను పీసీబీ కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ఇలా కేసులు వచ్చాయనే విమర్శలు మొదలయ్యాయి. కొవిడ్ కేసుల ప్రభావం టోర్నీపై పడేందుకు ఆస్కారముందని పాక్ మీడియా వ్యాఖ్యానించింది. ‘‘క్వారంటైన్ నిబంధనలను పక్కనపెట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను కూడా బయో బుడగలోకి అనుమతించారు. జట్లు బస చేసే హోటళ్లలో కొన్ని ఈవెంట్లతో పాటు విందులు కూడా జరిగాయి. బయట నుంచి ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు’’ అని కొన్ని పత్రికలు రాశాయి. క్రికెటర్లు బయో బుడగలో ఉన్నా వారికి సమీపంగా సేవలందించే మైదాన సిబ్బంది మాత్రం రోజూ ఇంటికి వెళ్లొస్తున్నారని, వారికి ఎలాంటి నిబంధనలు పెట్టలేదని మరో పత్రిక పేర్కొంది.