close

తాజా వార్తలు

Updated : 26/04/2021 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మే నెలలో.. ఒక్కరోజులో 10 లక్షల కేసులు!

ఆగస్టు 1 నాటికి 6.64 లక్షల మరణాలు సంభవిస్తాయన్న అధ్యయనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా రెండో దశ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 2 లక్షలకు చేరువవుతోంది. ఈనేపథ్యంలో మే నెలలో కొవిడ్‌ ఉద్ధృతి తారస్థాయికి చేరనుందన్న మిచిగాన్‌ విశ్వవిద్యాలయం అంచనాలు ఆందోళన రేపుతున్నాయి. భారత్‌లో మే నెల మధ్యనాటికి రోజువారీ కేసుల సంఖ్య 8 నుంచి 10 లక్షలకు చేరుతాయని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. మే 23 నాటికి రోజుకు 4,500 మంది మరణించే అవకాశం ఉందని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ మెట్రిక్స్‌ ఇవాల్యువేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) మాత్రం మే నెల ప్రారంభంలోనే.. అధికారిక, అనధికారిక లెక్కలతో కలిపి రోజుకు 10 లక్షల కన్నా ఎక్కువగానే కేసులు నమోదవుతాయని అంచనా వేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. కొవిడ్‌ వేరియంట్లు కాకుండా మరేమైనా కారణాలున్నాయా? అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ కరోనా కేసులు తగ్గిన అనంతరం మాస్కులు పెట్టుకోకపోవడం కూడా తీవ్రతకు కారణం కావచ్చని పేర్కొంటున్నారు. మహమ్మారిని జయించామనే భావన ప్రజల్లో రావడం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరక్కపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఒకానొక దశలో తగ్గిన వైరస్‌ చాపకింద నీరులా దేశాన్ని చుట్టేసింది. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ అనే ఇన్‌ఫ్లూయంజా సైతం అమెరికా, యూకేలలో ఈ తరహాలోనే విజృంభించింది. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో అలసత్వం కూడా వైరస్‌ తీవ్రరూపానికి కారణమవుతోంది.

మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో మరణాల సంఖ్య అధికంగా ఉండనుందని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు. రానున్న ఆగస్టు 1 నాటికి దేశంలో 6.64 లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. ఊహించిన దానికంటే అధిక మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నట్లు పేర్కొంది. అమెరికాలో 2020 మార్చి నుంచి 2021 జనవరి 1 వరకు అంచనా వేసిన దానికన్నా 23 శాతం ఎక్కువ మరణాలు నమోదైనట్లు గుర్తుచేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, దిల్లీలో కేసులు పెరిగే అవకాశం ఉందని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం పేర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, కర్ణాటకలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. బెంగాల్‌, యూపీ, బిహార్‌, కేరళలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగాన్ని బట్టే మూడో దశ వస్తుందా, రాదా.. అనేది ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితిని తట్టుకునేందుకు మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థ అవసరమని సూచించింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని