కరోనాకు ఇంటి వద్దే చికిత్స..!
close

తాజా వార్తలు

Updated : 01/08/2020 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు ఇంటి వద్దే చికిత్స..!

స్టెరాయిడ్‌ వినియోగంతో సత్ఫలితాలు 

అపోహలు తొలగిస్తే చాలు 

‘ఈటీవీ భారత్‌’తో అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యులు 

కరోనాకు వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాని తరుణంలో ఆ వైరస్‌ను నియంత్రించగల ఒకే ఒక మార్గంగా స్టెరాయిడ్లు కనిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న మందుల్లో ఇవే అత్యంత ప్రభావవంతమైనవిగా గుర్తించారు. వీటితో బాధితులు కోలుకునే తీరు, వేగం రెండూ పెరిగాయి. ఇంటివద్దనే ఉంటూ... ఈ తరహా చికిత్స అందించవచ్చని సూచిస్తున్నారు ఇమ్యునాలజిస్టులు. అమెరికాలోని మిషిగన్‌లో  20 ఏళ్లకు పైగా రోగనిరోధక నిపుణులుగా పని చేస్తున్న ప్రముఖ ఇమ్యునాలజిస్టులు డా.లోకేశ్వరరావు ఈదర, డా.అన్నె సురేశ్‌.. స్టెరాయిడ్‌ వినియోగం ద్వారా మంచి ఫలితాలను రాబట్టారు. భారత్‌ వంటి దేశాలకు ఇదే అత్యుత్తమ విధానమని వారు సూచిస్తున్నారు.

ప్రశ్న: కొవిడ్‌ను గుర్తించి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పుడు వైరస్‌పై కొంత అవగాహన వచ్చింది. ఈ సమయంలో దీనికి అత్యుత్తమ వైద్య విధానం ఏమిటి?  

డా.లోకేశ్‌: స్టెరాయిడ్లను ముందుగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీటిని మేము మూడు నెలల క్రితమే గుర్తించాం.  మా అనుభవంతో 80 శాతం మంది బాధితులకు వాళ్ల ఇంటివద్దే చికిత్స అందించవచ్చని భావిస్తున్నాం.

ప్రశ్న: స్టెరాయిడ్ల వాడకం ఎప్పుడు ప్రారంభమైంది. దాని ప్రభావం ఎలా ఉంది..? 

డా.సురేశ్‌: కొవిడ్‌ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో కొంచెం జ్వరం, దగ్గు, నలతగా అనిపిస్తుంది. ఇవి సాధారణంగానే తగ్గిపోతాయి. వైరస్‌ మొదటి దశలో శరీరంలోకి ప్రవేశించి... వివిధ కణాలలోకి వెళ్లి జన్యువులుగా విస్తరిస్తుంది. ఇలా కాకుండా ముందే అప్రమత్తమవ్వాలి. కొవిడ్‌ నిర్ధరణ అయిన వెంటనే.. చికిత్స ప్రారంభిస్తే దీర్ఘకాలిక సమస్యలు ఉండవు. ఈ వైరస్‌ కంటే .. దానికి మన రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తున్న తీరు వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. స్టెరాయిడ్స్‌ దీనిని తగ్గిస్తాయి. వీటిని వాడే విషయంలో ఇప్పటికీ అపోహలు ఉన్నాయి.  

ప్రశ్న: ఆసుపత్రికి వెళ్లడాన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్ల వినియోగాన్ని ఒక పరిష్కారంగా చూడవచ్చా..? 

డా.లోకేశ్‌: వైరస్‌ సోకిన వారిలో నూటికి 80 మందికి పెద్దగా లక్షణాలు కనపడవు. వీరు ఆసుపత్రికి వెళ్ళకుండానే కోలుకుంటారు. మిగిలిన 20 శాతం మందిలో కూడా ఎక్కువ మందికి ఇప్పుడు ఇంటి వద్దనే చికిత్స అందించవచ్చు. స్టెరాయిడ్స్‌ ఇవ్వడం ద్వారా వీరు కోలుకుంటారు. వందలో ఇద్దరు, ముగ్గురే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

ప్రశ్న: ఏ తరహా లక్షణాలున్నవారికి చికిత్సలో స్టెరాయిడ్లు వినియోగించవచ్చు..? ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నవారికీ దీన్ని వినియోగించవచ్చా..? 

డా.సురేశ్‌: 80% మందికి మొదటి దశలో నయమవుతుంది. మిగతా 20 మందే రెండో దశలోకి వెళ్తారు. వారికీ దాదాపు నయమవుతుంది. కానీ... వీరు రెండోదశలోకి రాకుండా చూడాలి. అందుకే స్టెరాయిడ్ల వినియోగం ప్రారంభించాలి.

ప్రశ్న: ఈ లక్షణాలున్నవారిని ఎలా గుర్తిస్తారు..? ఎవరికి చికిత్స ప్రారంభించాలి...?  

డా.సురేశ్‌: చాలామందికి ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు ఉంటాయి. కొంచెం నలతగా ఉండటం, రోజంతా పడుకోవడం, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ప్రారంభ దశలో హైపోఆక్సిమీయా(రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గడం) వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు పల్స్‌ ఆక్సీమీటర్‌ తీసుకోవాలి. 2-3 నిమిషాలు నడిచి అందులో పరీక్షించుకోవాలి. 94శాతం కంటే తక్కువగా ఉంటే  వైద్యుణ్ని సంప్రదించాలి. అప్పుడు స్టెరాయిడ్లను ఉపయోగిస్తే.. రెండో దశను ఆపేయొచ్చు. 

డా.లోకేశ్‌: 3 నిమిషాలు నడిస్తే.. 94శాతం కంటే తక్కువ పల్స్‌ ఉంటే స్టెరాయిడ్లు వాడాలి. సీటీస్కాన్‌ చేసినప్పుడు పాజిటివ్‌ నిర్ధరణ అయినా డోస్‌ తగ్గకుండా స్టెరాయిడ్లు వాడాలి.  దీన్ని కనీసం పది రోజులైనా వాడాలి.

ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పల్స్‌ ఆక్సీమీటర్‌ ఉపయోగించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరికైనా ప్రాథమిక    లక్షణాలు ఉంటే... ప్రాంతీయ వైద్యులు స్టెరాయిడ్‌ వాడాలని మీరు సూచిస్తున్నారా...?

డా.లోకేశ్‌: దాదాపు అందరు ఏఎన్‌ఎంల వద్ద పల్స్‌ ఆక్సీమీటర్లు అందుబాటులో ఉన్నాయి.  ఒకవేళ లేకపోతే.. వచ్చిన వ్యక్తి లక్షణాలు, పరిస్థితిని బట్టి ఐసీఎంఆర్‌ సూచనల ప్రకారం స్థానిక వైద్యుడు స్టెరాయిడ్‌ వినియోగించవచ్చు. 

ప్రశ్న: ప్లాస్మాథెరపీపై పరిశోధనలు ఏం     చెప్తున్నాయి..? మీ అనుభవాలేమిటి? 

డా.సురేశ్‌: ప్లాస్మాథెరపీ ద్వారా యాంటీబాడీస్‌ ఎక్కిస్తున్నారు. ఇది అంత ప్రభావం చూపుతున్నట్లు రుజువు కాలేదు. 

ప్రశ్న: మీరు చికిత్స చేసిన వారి నుంచి స్పందన ఎలా ఉంది..? 

డా.సురేశ్‌: స్టెరాయిడ్‌ వినియోగించి ఇచ్చే వైద్యంతో రికవరీ రేటు పెరిగింది. డెక్సామెథజోన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ చెప్పడానికి ముందే మేము వాడటం మొదలు పెట్టాం. మేం ఇళ్ల వద్ద చికిత్స ప్రారంభించినవారిలో ఒక్కరు మినహా అంతా ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారు. భారత్‌లో స్టెరాయిడ్‌ వినియోగం ఉత్తమం. ఇది అందుబాటులో ఉంటుంది. ఖర్చు తక్కువ. 

ప్రశ్న: స్టెరాయిడ్‌ ఎక్కువగా వాడొద్దని... దీని వాడకం మధుమేహులకు ఇతర   సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కొన్ని వాదనలున్నాయి. దీనికి మీరేమంటారు..?

డా.లోకేశ్‌: ఇది అపోహ మాత్రమే. మధుమేహాన్ని నియంత్రించడం సులభం. కానీ కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో స్టెరాయిడ్‌ వాడకపోతే చాలా ప్రమాదం. స్టెరాయిడ్‌ వాడటానికి భయపడి కొంతమంది ఆసుపత్రులకు వెళ్లారు. వారికి మళ్లీ స్టెరాయిడ్‌ ఉపయోగించి చికిత్స చేశారు. ఫలితంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. అవగాహన లేక కొందరు అపోహాలు సృష్టిస్తున్నారు. 

ప్రశ్న: లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని... ఆసుపత్రికి కచ్చితంగా వెళ్లాల్సిన వారిని ఎలా గుర్తించాలి...?

డా.సురేశ్‌: కొవిడ్‌ సోకిన వారికి అప్పటికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే ఇంట్లో వైద్యం చేయడం కష్టం. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం చేయించడం ఉత్తమం. నడవడం, పల్స్‌ ఆక్సీమీటర్లో పరీక్షలు చేసుకోవడం ద్వారా లక్షణాలు గుర్తించవచ్చు. వెంటనే అప్రమత్తమై వైద్యుల సలహాలు తీసుకుంటే వారు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 

ప్రశ్న: భారత్‌లో కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని నిరోధించడానికి ఎలాంటి వ్యూహం ఉండాలి.. ? 

వైద్యులు: కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. స్టెరాయిడ్‌ వంటి విధానం అందుబాటులో ఉందని వివరించాలి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని