
తాజా వార్తలు
రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ టీకా
హైదరాబాద్ : రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కొవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా cowin.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కొవిడ్ టీకా అందిస్తున్నట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కొవిడ్ టీకా తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రతి జిల్లాలో 2, హైదరాబాద్‌లోని 12 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేసినా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. ప్రైవేటులో 215 ఆసుపత్రులకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు అనుమతి ఉందన్నారు. డీఎంఈ రమేష్ రెడ్డి మాట్లాడుతూ... అందరూ మొదటి రోజే వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్చైర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.