close

తాజా వార్తలు

Updated : 16/01/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

ఇంటర్నెట్‌డెస్క్‌:  కొవిడ్‌ మహమ్మారిపై పోరులో నెలలుగా ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు 140 కేంద్రాల్లో పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.64 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు, 20 వేల కొవాగ్జిన్‌ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు తొలిటీకాను పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు ఇచ్చారు. నిమ్స్‌లో తెలంగాణ గవర్నర్‌ తమిళి సై, కోఠిలోని తిలక్‌నగర్‌ ఆసుపత్రిలో మంత్రి కేటీఆర్‌, వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్‌ మంత్రి గంగుల కమలాకర్‌, మహబూబ్‌నగర్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు.

రెండో విడతలో 50 ఏళ్లు పైబడిన వారికి
 కొన్ని నెలలుగా ఎదురు చూసిన కరోనా వ్యాక్సిన్‌ ఈరోజు అందుబాటులోకి రావడం పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో కరోనా వారియర్స్‌కు టీకా ఇస్తున్నామని, రెండో విడతలో 50ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్‌ అందిస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. దశలవారీగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు తప్పని సరిగా కొవిడ్‌  జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణకు చెందిన భారత్‌ బయోటెక్‌ గొప్ప ప్రయోగాలు చేసి ప్రపంచం ముందు తెలంగాణ  వ్యాక్సిన్‌ని ఆవిష్కరించిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో...
ఏపీలో కొవిడ్‌ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ పాల్గొని టీకా పంపిణీని ప్రారంభించారు. తొలి టీకా పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి ఇచ్చారు. రాష్ట్రంలోని 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది. ఇందులో 20వేల డోసులు కొవాగ్జిన్‌ (భారత్‌ బయోటెక్‌), మిగిలినవి కొవిషీల్డ్‌ (సీరం). తొలివిడతలో కొవిషీల్డ్‌నే లబ్ధిదారులకు వేయనున్నారు. తొలిరోజు ఒక్కోచోట వందమంది చొప్పున 332 కేంద్రాల్లో 33,200 మందికి టీకాలు ఇవ్వబోతున్నారు. ప్రాధాన్యక్రమంలో వీరి సెల్‌ఫోన్లకు శుక్రవారం నుంచి సంక్షిప్త సమాచారం వెళ్లడం మొదలైంది. దీని ప్రకారం వారు టీకా వేయించుకోవాలి. గుర్తింపుకార్డు చూపిస్తేనే పంపిణీ కేంద్రానికి అనుమతిస్తారు. కనీసం 15 రోజుల వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రోజూ 33,200 మందికి టీకా వేస్తారు. ¸టీకా వేయించుకున్న వారికి తిరిగి 28 రోజుల తర్వాత మలివిడత టీకా వేస్తామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని తెలిపారు. ఈ 332 కేంద్రాల్లో కలిపి 2,324 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. ప్రతి కేంద్రంలో మూడు గదులు ఏర్పాటుచేశారు. టీకా పంపిణీ సందర్భంగా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాలను వైద్యశాఖ సిద్ధం చేసింది.

 





Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని