అప్పనంగా కట్టబెట్టాలని చూస్తోంది: రామకృష్ణ
close

తాజా వార్తలు

Published : 11/03/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పనంగా కట్టబెట్టాలని చూస్తోంది: రామకృష్ణ

విశాఖ ఉక్కుపై తక్షణమే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయండి
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తోందని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆంధ్రుల ఆత్మాభిమానం, ఉద్యమస్ఫూర్తికి గుర్తుగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీకి సీఎం లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగాయని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

‘‘ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 19,700 ఎకరాల భూమిని ప్రజల నుండి సేకరించారు. ప్రస్తుతం ఆ భూముల విలువ సుమారు రూ.లక్ష కోట్లకుపైగా ఉంటుంది. అలాంటి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఆంధ్రులకు తీరని ద్రోహం చేయడమే. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికారు. తన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి సైతం విశాఖ ఉక్కు పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా మనమంతా ఒక్కటై మరోసారి 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అని గళమెత్తా్ల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం దిగొచ్చే వరకు రాజకీయాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని రామకృష్ణ కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని