ఈ బామ్మ స్టెప్పేస్తే.. నెట్టింట విజిల్సే
close

తాజా వార్తలు

Published : 04/03/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ బామ్మ స్టెప్పేస్తే.. నెట్టింట విజిల్సే

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిరుచికి వయసు అడ్డుకాదు.. ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశాలతో పనిలేదు అని నిరూపించారు ఈ బామ్మ. ఆరు పదుల వయసులో అలవోకగా, ఒయ్యారంగా డ్యాన్స్‌ చేస్తూ నెటిజన్ల మది దోచుకుంటున్నారు. ఆమే ముంబయికి చెందిన 62ఏళ్ల రవి బాలా శర్మ. 

రవి బాలా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉన్న ఆమె.. కథక్‌, తబలా, సంగీతం నేర్చుకున్నారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 27ఏళ్ల పాటు మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేశారు. అయితే డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో రిటైర్మెంట్‌ తర్వాత మళ్లీ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఓ ఆన్‌లైన్‌ పోటీ కోసం తొలిసారిగా డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోకు పెద్దఎత్తున ప్రశంసలు రావడంతో మరిన్ని వీడియోలు పోస్ట్‌ చేశారు. 

బాలీవుడ్‌ పాటలు, జానపద, భక్తి గీతాలతో పాటు భాంగ్రా పాటలకు కూడా ఎంతో చూడముచ్చటగా.. మంచి అభినయంతో ఆమె చేసే డ్యాన్స్‌లకు నెటిజన్లు మాత్రమే కాదు దిల్జిద్‌ దొసాంజె, ఇంతియాజ్‌ అలీ లాంటి ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఆమె వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇంకేముంది కొద్దిరోజుల్లోనే ‘డ్యాన్సింగ్‌ దాదీ’గా నెట్టింట స్టార్‌ అయ్యారు. ఇప్పటికే ఆమె ఇన్‌స్టా ఖాతాను లక్షమందికి పైగా ఫాలో అవుతున్నారు.

ఇద్దరు పిల్లల తల్లి అయిన రవి బాలా ప్రస్తుతం తన కుమారుడితో కలిసి ముంబయిలో ఉంటున్నారు. అప్పుడప్పుడూ కొడుకుతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలను కూడా షేర్‌ చేస్తుంటారు. పాటల ఎంపిక, కాస్ట్యూమ్స్‌ విషయంతో పిల్లలే ఆమెకు సాయం చేస్తుంటారట. ‘‘వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. దాని కోసం మీ ఇష్టాలు, అభిరుచులను వదులుకోవద్దు. మీ జీవితంలో ఏ దశలోనైనా మీకు గుర్తింపు రావొచ్చు. ఇందుకు నేనే ఓ ఉదాహరణ’’ అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. ఈ డ్యాన్సింగ్‌ దాదీ బ్యూటిఫుల్‌ స్టెప్పులను మీరూ చూసేయండి..
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని