
తాజా వార్తలు
దిల్లీ ఘటన: దీప్ సిద్ధూ ఎక్కడ?
దిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌సిద్ధూ అల్లర్ల తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట వద్ద ఆందోళనకారులతో కన్పించిన సిద్ధూ.. అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్‌పై వెళ్లిపోయినట్లు ఒక వీడియో ఫుటేజ్ వైరల్ అయ్యింది.
ట్రాక్టర్ల ర్యాలీపై మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో లైవ్ స్ట్రీమ్ చేసిన సిద్ధూ.. ఆందోళనకారులు ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయడాన్ని సమర్థించారు. అయితే, తాము జాతీయ పతాకాన్ని తొలగించలేదని, ఉద్యమానికి గుర్తుగా కేవలం సిక్కు మత చిహ్నమైన ‘నిశాన్ షాహిబ్’ జెండాను పెట్టినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఎర్రకోట నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైన సిద్ధూ.. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయారు.
కేసులో సిద్ధూ పేరు కూడా..
మరోవైపు గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో చోటుచేసుకున్న ఘటనలపై దిల్లీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో సిద్ధూ పేరు కూడా ఉంది. అటు ఘటనపై అతడికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఎవరీ దీప్ సిద్ధూ..
పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాకు చెందిన దీప్ న్యాయశాస్త్రం చదివాడు. గతంలో మోడల్‌గా పనిచేసి.. తర్వాత పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమంలో గత ఏడాది చేరాడు. నాటి నుంచీ అతని పాత్రను సంఘాలు శంకిస్తూనే ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు, భాజపా ఎంపీ సన్నీ దేవోల్‌కు దీప్ సిద్ధూ గతంలో సన్నిహితంగా ఉండేవాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ దేవోల్ పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అయితే, గతేడాది దీప్ రైతుల ఉద్యమంలో చేరడంతో అప్పటి నుంచి సన్నీ దేఓల్ అతడిని దూరం పెడుతూ వచ్చారు.
ఆ ధర్నాతో వెలుగులోకి..
రైతు సంఘాలు గత ఏడాది సెప్టెంబరు 25న బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా చేపట్టిన ఆందోళనల ద్వారా తొలిసారి దీప్ సిద్ధూ క్రియాశీల పాత్ర పోషించాడు. మరికొందరితో కలిసి దిల్లీ-హరియాణాల మధ్య షంబు సరిహద్దు వద్ద బైఠాయించి ధర్నాకు దిగడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతనికున్న ప్రజాదరణ నేపథ్యంలో కొన్ని రైతు సంఘాలు తమ వాస్తవ ఎజెండాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భయపడ్డాయి. అతను వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తున్నాడన్న ఆరోపణలు చేశాయి. మార్టిన్ లూథర్ కింగ్, సిక్కు వేర్పాటువాది భింద్రన్‌వాలేలను దీప్ సిద్ధూ తరచూ ప్రస్తావిస్తుండేవాడని చెబుతుంటారు.
ఇవీ చదవండి..
దిల్లీలో హింస: 550 ట్విటర్ ఖాతాల నిలిపివేత