
తాజా వార్తలు
అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని...
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పరువు హత్య తరహా ఘటన కలకలం సృష్టించింది. ఒక వర్గానికి చెందిన యువకుడు తమ కుమార్తెతో చనువుగా ఉంటున్నాడన్న నెపంతో ఆమె కుటుంబసభ్యులు అతడిని కొట్టి చంపడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో పోలీసులు దాని ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ దిల్లీ సీనియర్ పోలీస్ అధికారి విజయంత ఆర్య తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని జహంగీర్పూర్కు చెందిన రాహుల్ అనే యువకుడు బీఏ చదువుతూ.. స్థానికంగా ట్యూషన్లు సైతం చెబుతున్నాడు. ఆ యువకుడికి ఇటీవల ఓ యువతితో పరిచయం ఏర్పడింది. రాహుల్ వేరే కులానికి చెందిన వాడు కావడంతో.. తమ కుమార్తెతో చనువుగా ఉంటున్న విషయాన్ని ఆ యువతి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఇటీవల రాహుల్ వీధిలో వెళ్తుండగా అమ్మాయి సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు అతడిని అడ్డుకున్నారు. వారంతా ఒక్కసారిగా రాహుల్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ వీధిలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా నిందితులు ఆ యువకుడిపై దాడి చేసినట్లుగా గుర్తించారు. ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు.. ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.