ప్రమాదకారిగా.. కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌

తాజా వార్తలు

Updated : 09/06/2021 16:33 IST

ప్రమాదకారిగా.. కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌

వేగంగా వ్యాప్తి చేందే వైరస్‌గా వైద్యుల నిర్ధారణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ క్రమంగా రూపాంతరం చెందుతూ అందరినీ బెంబేలెత్తిస్తోంది. తాజాగా సార్స్‌కోవ్‌-2 కు చెందిన.. బి.1.617.2గా పరిగణిస్తున్న డెల్టా వేరియంట్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న్టట్లు వైద్యులు చెబుతున్నారు. రెండో దశలో కరోనా ఉద్ధృతమవడానికి ఈ రకం వైరస్‌ ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వెలుగుచూసిన వైరస్‌ రకాల్లో.. భారత్‌లో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ ఎంతమేర ప్రమాదకరమైందో తెలుసుకోవడానికి  ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సైతం డెల్టా వేరియంట్‌ను ప్రమాదకరమైన వైరస్‌గా వర్గీకరించింది.  గతేడాది బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌ కన్నా ఇది మరింత ప్రమాదకరమైందిగా పేర్కొంది. 

కొత్త లక్షణాలతో బేజారు..

కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ సోకిన వారిలో వినికిడి సమస్య, కడుపులో గ్యాస్‌, రక్తం గడ్డలు కట్టడం, తద్వారా పుండ్లు ఏర్పడటం లాంటి లక్షణాలు కనిపిస్తుండటంతో రోగులు  ఆందోళనకు గురవుతున్నారు.  ఆల్ఫాతో పాటు బీటా, గామా వేరియంట్‌ వైరస్‌లు సోకినవారిలో ఇలాంటి లక్షణాలు చాలా స్వల్పంగా కనిపించినట్లు న్యూ సౌత్‌ వేల్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్‌ 60 దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ రకం వైరస్‌ కారణంగా బ్రిటన్‌లో మునుపటికన్నా ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆల్ఫా వేరియంట్‌ కన్నా డెల్టా వేరియంట్‌ 50 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు భారత్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. భారత్‌లో  కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ అంశంపై శాస్త్రీయంగా మరిన్ని పరిశోధనలు జరగాల్పి ఉందని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చెందిన సాంక్రమిక వ్యాధుల వైద్య నిపుణుడు డా.అబ్దుల్‌ గఫూర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కొవిడ్ రోగుల్లో రక్తం గడ్డ కడుతున్న లక్షణాలతో ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. డెల్టా వేరియంట్‌ సోకడంతోనే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్న్టట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పేగులకు రక్త ప్రసరణ చేసే నాడుల్లో ఈ గడ్డలు ఏర్పడటం వల్ల రోగుల్లో కడుపు నొప్పి సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలతో గతేడాది మొత్తం మూడు నాలుగు కేసులు తమ ఆసుపత్రికి రాగా.. ప్రస్తుతం వారానికి ఒక కేసు వస్తున్న్టట్టు ముంబయికి చెందిన కార్డియాలజిస్టు గణేశ్‌ మనుధనె తెలిపారు. కొత్త రకం వైరస్‌ కారణంగానే ఇలాంటి లక్షణాలు కనిసిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.  అయితే వారిలో మునుపెన్నడూ అలాంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. చిన్నారుల్లోనూ డెల్టా వైరస్‌ సోకడం వైద్యులను కలవరపెడుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని