ఆఘాడీ సర్కారును కూల్చేందుకే ఈ కుట్రలు 
close

తాజా వార్తలు

Published : 08/04/2021 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఘాడీ సర్కారును కూల్చేందుకే ఈ కుట్రలు 

వాజే లేఖపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

ముంబయి: మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కొందరు ‘చెత్త’ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. అయితే, ఆ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవన్ని అన్నారు. ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్‌ వాజే.. దర్యాప్తు సంస్థకు రాసిన లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖపై స్పందించిన రౌత్‌.. భాజపాపై పరోక్ష ఆరోపణలు చేశారు. 

‘‘జైల్లో ఉన్న నిందితుల నుంచి లేఖలు రావడం ఇప్పడో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఇలాంటి చెత్త రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదు. దర్యాప్తు సంస్థలు, రాజకీయ పార్టీల ఐటీ విభాగాలు, నిందితులు రాసినట్లుగా చెబుతున్న లేఖలతో వ్యక్తుల పరువు ప్రతిష్ఠలను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇవి. ఇలాంటి కుట్రలు ఎన్నటికీ ఫలించవు’’అని రౌత్‌ మీడియాతో అన్నారు. వాజే తన లేఖలో పేర్కొన్న అనిల్‌ పరబ్‌ తనకు బాగా తెలుసని, బాల్‌ఠాక్రేపై ప్రమాణం చేసి ఆయన అబద్ధాలు చెప్పరని అన్నారు. 

మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వసూళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. వాజేకు నెల నెలా రూ. 100కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారని ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశాలు రావడంతో అనిల్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాజే.. ఎన్‌ఐఏకు రాసిన 4 పేజీల లేఖ కలకలం రేపుతోంది. లేఖలో అనిల్‌పై పరమ్‌బీర్‌ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధ్రువీకరించాడు. మరో ఇద్దరు మంత్రులు ప్రమేయంపైనా సంచలన విషయాలు బయటపెట్టాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని