close

తాజా వార్తలు

Updated : 04/08/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశమంతా హైదరాబాద్‌వైపే చూస్తోంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ మంగళవారం ఉదయం భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌, అత్యవసరం - సమతుల్యత’ అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు.

కొవాగ్జిన్‌ అభివృద్ధిలో నైపుణ్యం సాధించాం: కృష్ణ ఎల్లా

భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని తెలిపారు. కొత్త వైరస్‌ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయని తెలిపారు. ‘‘మేము మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చు.. కానీ మా అందరి పోరాటం కరోనాను జయించడమే’’ అని స్పష్టం చేశారు. భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా 3 హైదరాబాద్‌ కంపెనీల నుంచే జరుగుతోందన్నారు. భారతదేశ ఆవిష్కరణల్లో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంటుందన్నారు. ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్‌ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదన్నారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్‌లో ఇచ్చే వ్యాక్సిన్‌, విదేశాలకు ఎగుమతి చేసే వ్యాక్సిన్‌ ఒకే నాణ్యతతో ఉంటుందన్నారు.  ‘‘ప్రభుత్వం కరోనాను ఆరోగ్యపరమైన సంక్షోభంగానే చూస్తోంది. కరోనా భారీ ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకొచ్చింది. వ్యాక్సిన్ల అభివృద్ధిపై కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలి. వేగంగా వ్యాక్సిన్‌ తేవడానికి ఎవరి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. ప్రతి చిన్న అనుమతి కోసం దిల్లీ వెళ్లాల్సి వస్తోంది. అవసరమైన అనుమతులు ప్రాంతీయ కేంద్రం నుంచే ఇవ్వాలి ’’ అని సూచించారు.

 

నిధుల లభ్యత కీలకం: మహిమ దాట్ల

బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా స్పైక్‌ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఏ వ్యాక్సిన్‌ కూడా భద్రతను పణంగా పెట్టి ప్రయోగాలు చేయదన్నారు. వ్యాక్సిన్ల అన్నింటి లక్ష్యం కరోనా నుంచి రక్షణ కవచం అందించడమేనని స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సహజంగా కొన్ని ప్రతిజనకాలు ఏర్పడతాయి... అదే శక్తిని వ్యాక్సిన్లు ఔషధ రూపంలో అందిస్తాయని వివరించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి విధానాన్ని బట్టి వాటి సామర్థ్యాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి అని తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నెల వ్యవధిలోనే భారీ స్థాయి ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నెల వ్యవధిలో 8 నుంచి 10కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురాగలమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిధుల లభ్యత చాలా కీలకమని, ప్రభుత్వాలు ఈ విషయంపై స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు.

 

వ్యాక్సిన్‌ ధర అందుబాటులో ఉండాలి: డాక్టర్‌ ఆనంద్‌

ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్‌ ఎండీ డాక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ అధిక ధరలో ఉంటే చాలా మందికి అందుబాటులో లేకుండా పోతుందన్నారు. ‘‘ఒక్కో డోసు ధర రూ.1000 అయినా భారత్‌ లాంటి దేశాలకు అది చాలా భారం. మేము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు కొంత సమయం పట్టొచ్చు..కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది. దేశంలో ఏడు సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. ఈ ఏడు సంస్థలను కలిపి ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. డీబీటీ, సీఎస్‌ఐఆర్‌ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. దేశంలోని వివిధ పరిశోధన సంస్థల మధ్య వారధిలా వ్యవహరించాలి. సాధారణ పరిస్థితుల్లోనే నియంత్రణ సంస్థలకు వెళ్లడం చాలా కష్టమైన వ్యవహారం. కరోనా కారణంగా అక్కడికి వెళ్లడం కష్టతరంగా మారింది’’ అని అనంద్‌ పేర్కొన్నారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.