
తాజా వార్తలు
నిజమెవరిదో అర్థం కావట్లేదు: డీకే అరుణ
ఉద్యోగాల అంశంపై చర్చకు సిద్ధమని వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఇప్పటివరకు 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశామని టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి చెబుతుంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సింగరేణిలో ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలను సైతం కొత్త ఉద్యోగాల జాబితాలో చేర్చారని అరుణ మండిపడ్డారు. ప్రస్తుత ఖాళీలకు, కేటీఆర్ ప్రకటించిన లెక్కలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చకు సిద్ధమని.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తన సవాల్‌ను స్వీకరించాలని ఆమె డిమాండ్ చేశారు.