అన్నాడీఎంకే, డీఎంకే వ్యూహ ప్రతివ్యూహాలేంటి?
close

తాజా వార్తలు

Updated : 21/02/2021 04:03 IST

అన్నాడీఎంకే, డీఎంకే వ్యూహ ప్రతివ్యూహాలేంటి?

‘తమిళనాట ఎన్నికల పోరు అన్నాడీఎంకే, డీఎంకే మధ్య మాత్రమే. జాతీయ పార్టీలు ప్రేక్షక పాత్ర పోషించక తప్పదు’. తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడిన సందర్భాల్లో నిపుణులు తరచూ చెప్పే మాట ఇది. అంతగా అక్కడ తమ ప్రాబల్యాన్ని చాటాయి ద్రవిడ పార్టీలు. అయితే అన్నాడీఎంకే లేదంటే డీఎంకే రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నాయి. 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అన్నాడీఎంకే పార్టీ చేతిలో ఓటమి పాలైంది. అప్పటినుంచి అంటే నాలుగు దశాబ్దాలుగా ఈరెండు ద్రవిడ పార్టీల మధ్యే ఎన్నికల పోరు జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన రాష్ట్రంలో ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు వరుసగా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్నాడీఎంకే ఈసారి కూడా అదే జోరు కనబర్చాలని భావిస్తోంది. ఇందుకోసం మునుపటికన్నా మరింత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో అనేక మార్పులు జరిగాయి. ఒకానొక దశలో పార్టీ ఎవరి ఆధీనంలోనూ లేకుండాపోయింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరించారు నేతలందరూ. 2017లో పార్టీ బాధ్యతలు పన్నీర్‌సెల్వం నుంచి శశికళ చేతికి, ఆమె నుంచి మళ్లీ పళనిస్వామికి పది రోజుల్లోనే మారాయి. అప్పటినుంచే ఈ అనిశ్చితి కనిపిస్తూ వచ్చింది. శశికళ జైలుపాలవ్వడం, అత్యున్నత అధికారుల ఇళ్లల్లో సోదాలు లాంటి పరిణామాలు పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. ఈ సమయంలోనే భాజపా అన్నాడీఎంకేకు దగ్గరైంది. జయలలిత మరణించే సమయానికి పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ఆయన ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. అయితే తనను బలవంతంగా పదవి నుంచి తప్పించారని ఆయన ప్రకటించారు. తరువాత మూడు రోజులకే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై పన్నీర్‌సెల్వం నిరసన వ్యక్తం చేశారు. తరువాత ఆయన పార్టీ నుంచి తప్పుకోవడం, మళ్లీ చేరడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

శశికళ రూపంలో అవరోధాలు

ఈ క్రమంలోనే అన్నాడీఎంకే కోశాధికారి, శశికళ మేనల్లుడు దినకరన్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి పార్టీ వర్గాలు. పూర్తిగా పార్టీ వ్యవహారాలు తన చేతిలో ఉండాలని భావించిన ముఖ్యమంత్రి పళనిస్వామి.. దినకరన్‌ను పక్కనపెట్టారు. దీంతో దినకరన్‌ వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇలా వరుస వివాదాలతో ఆ పార్టీ ఇరకాటంలో పడింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ పార్టీకి ఇప్పుడు ప్రధాన సవాలు శశికళ వ్యూహాలను నిలువరించడం. ఆమె అన్నాడీఎంకే పార్టీని ఆధీనంలోకి తెచ్చుకుంటానని శపథం చేశారు. అధికార పార్టీ మాత్రం అది అసాధ్యమంటోంది. ఓటు శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకేకి శశికళ రూపంలో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అవినీతి ఆరోపణలు మరో సమస్య. అందుకే ఈసారి ఏఐడీఎంకే పార్టీ విజయం నల్లేరుపై నడకేమీ కాదంటున్నారు పలువురు విశ్లేషకులు. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు డీఎంకే క్యాడర్‌ బలంగా పెరిగింది. ఫలితంగా స్టాలిన్‌ సేనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

విజయంపై పళని ధీమా

అయితే అన్నాడీఎంకే మాత్రం విజయంపై ధీమాగా ఉంది. పైగా ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీని విస్తృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తన చరిష్మాను పెంచుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోయినప్పటికీ పళనిస్వామి ఆందోళన చెందలేదని చెబుతున్నారు. తరువాత 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా 9 చోట్ల పార్టీ గెలిచేలా కృషి చేశారు. నిజానికి ఆ సమయంలో అన్నాడీఎంకే ఉన్న పరిస్థితుల్లో ఈ విజయం నమోదు చేయడమే గొప్ప. ఎంజీఆర్‌, జయలలిత లేని లోటును భర్తీచేసేందుకు బాగానే కష్టపడ్డారు. పార్టీ ప్రతిష్ఠను చాలా వరకు పెంచగలిగారు. గౌండర్‌ సామాజికవర్గ ఓట్లు తమవైపునకు మళ్లించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. మొత్తంగా ముఖ్యమంత్రిగానే కాకుండా పార్టీలో అన్నీ తానై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పళనిస్వామి. తనకంటూ సొంత వర్గాన్ని సంపాదించుకోగలిగారు. ఆ ఉత్సాహంతోనే రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న క్యాడర్‌తో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ధీమాగా చెబుతున్నారు పళనిస్వామి.

డీఎంకే వ్యూహమేంటి?

ఇక డీఎంకే విషయానికొస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 39 స్థానాలకు గాను 23 చోట్ల విజయం సాధించగలిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు స్టాలిన్‌. ఆ సమయంలో ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్య ఓట్ల తేడా 1.1 శాతం మాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో 52.39 శాతం ఓట్లు సాధించగలిగింది ఈ పార్టీ. ఈసారి అదే దూకుడు ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. ప్రశాంత్‌ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకొంది. అన్నాడీఎంకే,  భాజపా కలవడంపై మొదటి నుంచే విమర్శలు చేస్తోంది. హిందూత్వ పార్టీగా పేరుగాంచిన జాతీయ పార్టీని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మైనారిటీ వర్గాలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేస్తూ ఆ మేరకు ప్రజల్లో అధికార పార్టీపై ప్రతికూలత పెరిగేలా ప్రచారం చేస్తోంది.  అయితే ప్రస్తుతానికి డీఎంకేలో స్టాలిన్‌ మాత్రమే కీలక నేతగా ఉన్నారు. ఆయనే పార్టీ క్యాడర్‌ పెంచేందుకు కృషి చేస్తున్నారు. కాకపోతే సోదరుడు ఎంకే అళగిరి రూపంలో ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధపడింది డీఎంకే. అయితే రాష్ట్రంలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. అధికార పార్టీకి ప్రస్తుతం ఉన్న సమస్యలనే తమకు అనుకూలంగా మలచుకునే ప్రతి ప్రయత్నాన్ని చేస్తోంది డీఎంకే. అయితే కాంగ్రెస్‌తో సీట్లు పంచుకునే విషయంలో విభేదాలు తలెత్తే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ స్టాలిన్‌ మాత్రం ఎలాంటి సమస్యలు రాకుండా సామరస్యంగా సీట్ల పంపకాలు జరపాలని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని