
తాజా వార్తలు
శునకం అనుకరణ.. యజమానికి ₹26వేల బిల్లు!
(ఫొటో: రస్సెల్ జోన్స్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: శునకాలు మనిషికి మంచి స్నేహితులు అని చెబుతుంటారు. నిజమే.. మనుషుల భావాలను, మాటలను శునకాలు చక్కగా అర్థం చేసుకుంటాయి. యజమాని సంతోషంలో ఉంటే.. శునకాలు మరింత హుషారుగా ఉంటాయి.. బాధపడితే అవి కూడా బాధపడుతూనే అమాయక ప్రవర్తనలతో ఓదారుస్తుంటాయి. అలాగే ఓ శునకం తన యజమాని కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే.. సానుభూతి చూపే క్రమంలో ఆయన్ను అనుకరించే ప్రయత్నం చేసింది. దీంతో యజమానికి రూ. 26వేల ఖర్చు అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
లండన్‌లో నివసించే రస్సెల్ జోన్స్‌కు ఇటీవల కాలికి గాయమైంది. చికిత్సలో భాగంగా వైద్యులు ఆయన కాలుకు కట్టుకట్టారు. దీంతో రస్సెల్ కర్రల సాయంతో కాస్త కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని నిమిత్తం రస్సెల్ బయటకు వెళ్తుంటే.. ఆయన పెంచుకుంటున్న శునకం ‘బిల్’ కూడా వెంట వెళ్లేది. అయితే, తన యజమాని కుంటుతుండటంతో బిల్ కూడా కుంటడం మొదలుపెట్టింది. రస్సెల్ మాత్రం శునకం కాలికి కూడా గాయమైందేమోనని కంగారు పడ్డారు. వెంటనే పశువైద్యుల వద్దకు తీసుకెళ్లి.. ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేయించాడు. కానీ, వైద్యుల నివేదికలో బిల్ కాలికి ఎలాంటి గాయాలు కాలేదని తేలింది. అప్పుడు అర్థమైంది.. తను కుంటుకుంటూ నడవంతో బిల్ తనని అనుకరించిందని. శునకం చూపించిన సానుభూతికి రస్సెల్ ముగ్ధుడైనా.. దానికి నిర్వహించిన వైద్య పరీక్షలకు 300యూరోలు(రూ.26,533)ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని రస్సెల్ తన ఫేస్బుక్లో పోస్టు చేస్తూ.. తనను అనుకరిస్తూ కుంటుతున్న శునకం వీడియో జతచేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారడమే కాదు.. యజమానిపై శునకం చూపించిన ప్రేమ, సానుభూతికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఇవీ చదవండి..
పిల్లితో గూఢచర్యం: విఫలయత్నం.. ₹కోట్లు ఖర్చు
శునకాలు కరోనా బాధితుల్ని పసిగట్టగలవా?