ఎరవేసి.. బానిసలను చేస్తూ..
close

తాజా వార్తలు

Updated : 13/07/2020 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎరవేసి.. బానిసలను చేస్తూ..

విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ విక్రయాలు

బెజవాడలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మాఫియా

ఈనాడు డిజిటల్‌, విజయవాడ

దిల్లీ, గోవా, హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉండే డ్రగ్స్‌ వ్యాపారం ఇప్పుడు విజయవాడకూ పాకింది. గత కొన్ని నెలలుగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు నగరంలో జోరుగా సాగుతున్నట్లు అధికారుల దాడుల్లో బహిర్గతమవుతోంది. దీనిలో కీలక వ్యక్తులు పలు దేశాలకు చెందిన వారు ఉండటం విశేషం. విందులు, వినోదాలు, సరదాగా మద్యాన్ని తాగుతున్న యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముందుగా తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రలోభపెట్టి తర్వాత వారిని డ్రగ్స్‌కు బానిసలను చేస్తున్నారు.

విద్యార్థి ముసుగులో..

బెంగళూరు, ముంబయి, గోవా తదితర ప్రాంతాల నుంచి నగరానికి డ్రగ్స్‌ను తీసుకొస్తున్నారు. విద్యార్థులను, యువకులను ఆకర్షించి వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. శుక్రవారం టాస్క్‌ఫోర్సు పోలీసులకు దొరికిన ఇద్దరు విదేశీయులు గతేడాది అక్టోబర్‌లో ఇదే తరహా కేసులో అరెస్టు అయ్యారు. అప్పుడు కూడా వీరి నుంచి 14 గ్రాముల మెథలైన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌, 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు వడ్డేశ్వరం, కానూరు, పటమట, పోరంకి తదితర ప్రాంతాలకు చెందిన వారిని అరెస్టు చేశారు. జైలుకి వెళ్లిన విదేశీయులు ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే నేరాలకు పాల్పడుతూ దొరకడం గమనార్హం. గతనెల రోజులుగా పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌బ్యూరో అధికారుల దాడుల్లో పదుల సంఖ్యలో గంజాయి నిందితులు దొరికారు. వీరంతా యుక్తవయస్సువారే కావడం విశేషం. విద్యార్థులే లక్ష్యంగా మత్తుపదార్థాలను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉచ్చులో ఉన్న చాలా మంది కొత్తవారే. వీరిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని సమాచారం.


విక్రయించినా, వినియోగించినా.. శిక్షే

సాధారణంగా మాదకద్రవ్యాల్ని తరలించడం, విక్రయించడమే నేరమని చాలా మంది భావిస్తుంటారు. కానీ సవరించిన చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల్ని కలిగి ఉండటంతో పాటు వినియోగించడాన్ని నేరంగానే పరిగణిస్తున్నారు. ఈ అభియోగాల కింద నేరం రుజువైతే పదేళ్ల వరకు శిక్షార్హులవుతారు. పెద్దఎత్తున జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని 31ఏ సెక్షన్‌ ప్రకారం మరణశిక్ష విధించే అవకాశముంది.


నిరంతరం నిఘా

- శ్రీనివాసరావు, ఏడీసీపీ, టాస్క్‌ఫోర్సు

గరంలో డ్రగ్స్‌, గంజాయి క్రయవిక్రయాలు జరిపే వారిపై నిరంతరం నిఘా పెడుతున్నాం. తల్లిదండ్రుల పర్యవేక్షణలేని వారే ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. చెడు మార్గంలో పయనిస్తున్నట్లు గమనిస్తే వెంటనే వారిని సన్మార్గంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. మాదకద్రవ్యాల విక్రేతలే కాదు వాటిని వాడే యువతకు సైతం శిక్షలు తప్పవు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని