Eatala: మా ప్రజల్ని ఎవరూ కొనలేరు
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Eatala: మా ప్రజల్ని ఎవరూ కొనలేరు

హుజూరాబాద్‌: తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని తెరాస నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక నేతలను బ్లాక్‌ మెయిల్‌ చేసే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. కులమతాలకు సంబంధం లేకుండా అందరి ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి హుజూరాబాద్‌ అండగా ఉందన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. 

ప్రజలు గమనిస్తున్నారు..

‘‘నాపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు.. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా వస్తున్నవారు ఏనాడైనా ఆపదలో ఆదుకున్నారా? సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీల గెలుపులో తోడ్పాటు అందించారా? కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లను బిల్లులు రావని బెదిరిస్తున్నారు. గ్రామాలకు రూ.50లక్షలు, రూ.కోటి నిధులు రావాలంటే తమతో ఉండాలని చెబుతున్నారు. స్థానిక నేతలపై ఒత్తిడితో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని హుజూరాబాద్‌, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అన్యాయం.. అక్రమమా?ఇదేం రాజకీయమని అసహ్యించుకుంటున్నారు. 

హెచ్చరికలు ఆపకపోతే కరీంనగర్‌ కేంద్రంగా ఉద్యమం

మంత్రి కాకముందు సంస్కారం లేకపోతే ఫర్వాలేదు.. ఆ తర్వాతైనా ఉండాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అలా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్లే. కరీంనగర్‌ ప్రజలు ఓట్లేసి గెలిపించింది హుజూరాబాద్‌ ప్రజల్ని వేధించమని కాదు. 2023 తర్వాత నీ అధికారం ఉండదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు పనికిరావు. మర్యాదగా నడుచుకోండి. మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెళ్లో పెట్టుకున్నారు. దేవుళ్లను మొక్కను.. ప్రజల హృదయాలనే గుడులుగా భావిస్తా. ఆపదలో ఉంటే ఆదుకునే ప్రయత్నం చేస్తుంటా. తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు.

సకల జనులు అండగా ఉంటారు

హుజూరాబాద్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. ఒక వేళ ఎన్నికలు జరిగితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు సకల జనులు, ఉద్యమకారులంతా నాకు, ఇక్కడి ప్రజలకు అండగా ఉంటారు. స్థానిక నేతలను ప్రలోభపెడితే తాత్కాలికంగా మీకు జై కొట్టొచ్చు.. కానీ వారి హృదయాలు ఘోషిస్తున్నాయి. హుజూరాబాద్‌ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజలు అనామకులు కాదు. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపకపోతే కరీంనగర్‌ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుంది’’ అని ఈటల హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని