‘మమతపై దాడి నివేదిక నామమాత్రంగానే ఉంది’
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మమతపై దాడి నివేదిక నామమాత్రంగానే ఉంది’

సమగ్ర వివరాలు సమర్పించాలని సీఎస్‌కు ఈసీ ఆదేశాలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక నామమాత్రంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినట్లు తెలిపారు. ‘తనపై నలుగురు-ఐదుగురు దాడి చేశారు’ అన్న మమత ఆరోపణలకు సంబంధించి.. వారెవరు అనే ప్రస్తావనే నివేదికలో లేదని పేర్కొన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది? దీని వెనుక ఎవరుండే అవకాశం ఉంది? వంటి అంశాలు నివేదికలో లేవని తెలిపారు. కేవలం అక్కడ భారీ స్థాయిలో జనాలు గుమికూడారని మాత్రమే పేర్కొన్నారని వివరించారు. పైగా దాడికి సంబంధించిన స్పష్టమైన వీడియో ఫుటేజీ కూడా లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్రమైన వివరాలతో శనివారం సాయంత్రంలోగా మరో నివేదిక సమర్పించాలని ఆలాపన్‌ని ఆదేశించామన్నారు.

నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన అనంతరం ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో బుధవారం దీదీ కాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. సీఎంపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. మరోవైపు తృణమూల్‌ ఆరోపణలను భాజపా ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదమేనని కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఈ ఘటనపై ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. మరోవైపు కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందిన దీదీ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని