
తాజా వార్తలు
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘం. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. నిన్న హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదు. మధ్యాహ్నం 3గంటలకు సీఎస్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని కోరాం’’ అని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
ఈ ఎన్నికలు చరిత్రాత్మకం..
ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ‘‘విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ఐజీ స్థాయి అధికారులతో ఏకగ్రీవాలపై దృష్టి పెడతాం. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయి. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్, న్యాయ సలహాదారు ఎవరు లేరు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టుకు వెళ్లాం. కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదు. ప్రభుత్వ ఉదాసీనతను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లా. కమిషన్‌లో కొంతమందే ఉన్నా సమర్థంగా పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్నా కమిషన్ పనితీరులో అలసత్వం ఉండదు. ఈ ఎన్నికల నిర్వహణ కమిషన్‌కు పెను సవాలే. ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపించాయి. దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదు. ఉద్యోగులు ప్రజాసేవకులు... ఆ ధర్మాన్ని విస్మరిస్తే దుష్పలితాలు ఉంటాయి. ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకం. ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి’’ అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోరారు.
ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వానిదే బాధ్యత
ఎన్నికల నిర్వహణ లో ఇబ్బందులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.‘‘ దీనిపై గవర్నర్ కు నివేదిస్తా, అవసరమైతే సుప్రీంకోర్టు కు కూడా నివేదిస్తా. ఎన్నికల్లో పాల్గొనాలని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి అభిప్రాయం గౌరవించాలి. మూడు రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం... రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. ఉన్న సవాళ్ళను అధిగమించి ముందుకు వెళ్తా. రాజ్యాంగ బాధ్యతలు పూర్తి చేయడానికే ముందుకు వెళ్తా. ఇది నా వ్యక్తిగత నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, జిల్లా కలెక్టర్ ల సహకారం ఉంటుందని భావిస్తున్నా. వివరాలు ఇవ్వడం లో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్ విఫలం అయ్యారు. 2021 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి. కానీ విధిలేని పరిస్థితుల్లో 2019 నాటి ఓటరు జాబితా తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతో 3.6 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ అలసత్వం, బాధ్యతా రాహిత్యం వల్ల ఇది జరిగింది. సరైన సమయంలో దీనిపై కమిషన్ చర్యలు తీసుకుంటుంది. సోమవారం వరకు నోటిఫికేషన్ నిలుపుదల చేయాలని ప్రభుత్వం కోరింది. కానీ ఇది సహేతుకంగా లేదని కమిషన్ అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణ కు ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. కొన్ని సమాచారాలు రహస్యం గా ఉండాలి కానీ సీఎస్ రాసిన లేఖ నాకు చేరక ముందే టీవీ ఛానెళ్ళలో వచ్చింది. ఇక నుంచి అయినా గోప్యత పాటించాలి’’ అని రమేశ్ కుమార్ అన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి..
చిత్తూరు, గుంటూరు కలెక్టర్లపై వేటు