
తాజా వార్తలు
ఫేస్‌బుక్‌కు కొత్త సమస్య..ఆటోమేటిక్‌గా లాగౌట్
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఐఫోన్ యూజరా..మీ ఫోన్లో ఫేస్బుక్ వాడుతున్నారా.. అయితే మీ ఖాతా లాగిన్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే..రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఐఫోన్లలో ఫేస్బుక్ ఖాతా యూజర్స్ ప్రమేయం లేకుండా లాగౌట్ అయ్యాయట. ఈ విషయాన్ని పలువురు యూజర్స్ ట్విటర్ వేదికగా తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సమస్యను గుర్తించిన వెంటనే పలువురు యూజర్స్ తమ ఖాతాల్లోకి తిరిగి లాగిన్ కాగా మరికొందరు యూజర్స్‌కి 2 ఫాక్టర్ అధెంటికేషన్ (2FA) ద్వారా లాగిన్ అవ్వమని సూచించినట్లు తెలిపారు. అంతేకాదు 2FA కోసం వచ్చే ఎస్సెమ్మెస్‌లు కూడా చాలా ఆలస్యంగా వచ్చినట్లు వెల్లడించారు. దీంతో ఫేస్బుక్ వినియోగంపై యూజర్స్ కొంత గందరగోళానికి గురయ్యామని తెలిపారు.
దీనిపై ఫేస్బుక్ సంస్థ స్పందించింది. కాన్ఫిగరేషన్ ఛేంజ్ వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ సమస్యను గుర్తించి దానిని పరిష్కరించినట్లు తెలిపింది. ‘‘ఫేస్బుక్ ఉపయోగించడంలో పలువురు యూజర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా ఖాతా లాగిన్‌లో తలెత్తున్న ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఇప్పటికే మా టీం దీనిపై పనిచేయడం ప్రారంభించింది’’ అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల వ్యక్తిగత గోప్యత, యూజర్ డేటాకు సంబంధించి యాపిల్, ఫేస్బుక్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. దాని కారణంగానే ఈ సమస్య తలెత్తిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
యూజర్ డేటా ఆధారంగా యాడ్స్ ఇవ్వాలనే ఫేస్బుక్ ప్రతిపాదనను యాపిల్ తిరస్కరించింది. దీంతో దిగ్గజ కంపెనీల మధ్య కొంత కాలం వాదోపవాదాలు నడిచాయి. చివరకు యాపిల్ నిబంధనలకు ఫేస్బుక్ అంగీకరించింది. ఇందులో భాగంగా ఐఓఎస్ 14 ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో ఉన్న యాప్‌ల ద్వారా ఆయా కంపెనీలు తమ అవసరాల కోసం యూజర్ డేటాను ట్రాక్ చేయకూడదు. అలానే అన్ని యాప్‌లు ప్రైవసీ లేబుల్స్ కలిగి ఉండాలని యాపిల్ డెవలపర్లకు సూచించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కు చెందిన ఇతర యాప్స్‌ను యాపిల్ బ్లాక్ చెయ్యొచ్చని ఫేస్బుక్ అభిప్రాయపడింది.
ఇవీ చదవండి..
అంధుల కోసం ఫేస్బుక్ కొత్త అప్డేట్..
FBలో కొత్త ఫీచర్స్..లైక్ బటన్ ఉండదు..!