
తాజా వార్తలు
దట్టమైన పొగమంచులో..37వ రోజుకు నిరసన
కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గని రైతన్న
దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ నిరసనను 37 రోజూ కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో..దిల్లీ శివారుల్లోని సింఘు, టిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల వద్ద బైఠాయించి కేంద్రంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన ప్రాంతంలోనే నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఒకవైపు, దిల్లీలో 15 ఏళ్లలో లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేంద్రం, అన్నదాతల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడటం లేదు.
ఇప్పటికే డిసెంబర్ 30న ఇరు వర్గాల మధ్య ఆరో విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి చర్చల్లో కొద్దిపాటి పురోగతి కనిపించినా..చట్టాల రద్దుకు మాత్రం కేంద్రం అంగీకరించలేదు. దాంతో జనవరి 4న మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు జరిగే చర్చల్లో సాగు చట్టాల రద్దుకు హామీ ఇవ్వకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. అలాగే తమకు మద్దతుగా ప్రతిజ్ఞ చేయాలంటూ రైతు సోదరులు దేశ ప్రజలను కోరారు.
ఇవీ చదవండి.. సాగు చట్టాల రద్దుతోనే మాకు కొత్త ఏడాది