కుమార్తెను కాపాడబోయి తండ్రి మృతి
close

తాజా వార్తలు

Published : 21/04/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుమార్తెను కాపాడబోయి తండ్రి మృతి

తుని గ్రామీణం: అమ్మానాన్నలు మందలించారని కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిందా బాలిక.. ఆమెను కాపాడే యత్నంలో తండ్రి మృతిచెందారు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.  హంసవరం గ్రామానికి చెందిన జయదేవ్‌(45), అప్పలకొండ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తలిద్దరూ మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. తాము వచ్చే సరికి అన్నం వండ వచ్చుకదా అని పెద్దకుమార్తెను మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లడాన్ని జయదేవ్‌ గమనించారు. వెంటనే ఆయన మరో ద్విచక్రవాహనంపై కుమార్తె వెంట వెళ్లారు.
గ్రామ శివారులో ఉన్న పోలవరం కాలువ వంతెన వద్ద వాహనాన్ని నిలిపిన బాలిక కాలువలోకి దూకింది. కుమార్తెను రక్షించేందుకు జయదేవ్‌ కూడా దూకారు. అక్కడే ఉన్న కొందరు స్థానికుల సహాయంతో జయదేవ్‌ తన కుమార్తెను ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో అప్పటికే అలసిపోయిన ఆయన   నీటిలో మునిగి గల్లంతయ్యారు. అపస్మారక స్థితికి చేరిన బాలికను స్థానికులు తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్‌ అందించి వైద్యులు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలించి జయదేవ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. ఓ వైపు విగతజీవిగా పడిఉన్న భర్త... మరోవైపు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కుమార్తె... ఈ పరిస్థితిలో అప్పల కొండ రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని